పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

7

సారూప్యంబు నీ ధ్యానంబున నిలిచినది; సాయుజ్యంబు నిద్రాసమయంబునంగలదు; నీకు శరణుసొచ్చినం బాపవిముక్తి సేతునంటివి గావున జీవన్ముక్తి సమకూడె. నీవు నన్నెడబాయకుండుటంజేసి సదానందానుభవంబు గలిగె. నీపై భక్తియొసంగినందువలన జన్మ శుద్ధియయ్యె. నాలుకకు మీ నామామృతం బొసగినకతన నమృతపానంబు దొరకె. మఱియు నీ దాసులసంగతిని యోగము నలవడె. ఇంక ని న్నడిగెడిదేమి? అన్నిటం గృతార్థుఁడనైతిని. శ్రీ వేంకటేశ్వరా!

14

శార్‌ఙ్గాయుధధరా! నిన్ను భజించి యేమియైననుం గోరి యడిగెద నంటినేని నీకంటె నుత్తమవస్తుపు లెక్కడ నున్నవి? నీయందే మూర్తిత్రయంబును, ద్వాదశాదిత్యులును నేకాదశరుద్రులును, నవబ్రహ్మలును, నేకోనపంచాశన్మరుత్తులును, వసువులును, దిక్పాలకులును, మునులును, సిద్ధగంధర్వపదంబులును; అణిమాద్యష్టైశ్వర్యంబులును, చతుర్దశభువనంబులును, కులాచలదిగ్గజ మహానాగములును, సింధుగంగానదీ ముఖ్యతీర్థంబులును, సకల సామ్రాజ్యంబులును నున్నవి. పరమపదంబున్నది. నీవుగలచోట నన్నియుం గలవు. నిన్ను నాత్మందలంచిన నాకు సకలసౌఖ్యంబులుం గలవు. శ్రీ వేంకటేశ్వరా!

15

నీలమేఘశ్యామలా! అణువులకు నణువవు; మహత్తులకు మహనీయుండవు; ప్రకృతిపురుషులకుం బరమాత్మవు; మూఁడు మూర్తులకు మూలమవు; చరాచరంబులకు సాక్షివి; ఊహించిచూచిన నొక్కండవే దేవుండవు; ఏర్పఱిచిచూచిన ననంతుండవు; తలఁచిన నభేద్యతత్పదుఁడవు; విచారించిన నిర్గుణుఁడవు; వినం గణంగినఁ గల్యాణగుణుండవు; కన్నులం జూచిన సాకారమవు; స్వరూపవ్యాప్తిని నిరవద్యుండవు; స్వాతంత్ర్యంబున జీవచైతన్యమవు; భక్తిపరులకుఁ