పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు.

1

శ్రీవేంకటగిరిదేవా! నా దేహంబు నీ వుండెడి నిత్యనివాసంబు; నా జ్ఞానవిజ్ఞానంబులు నీ యుభయపార్శ్వంబుల దీపంబులు; నా ముకుఁజెఱమలయూర్పులు నీ యిరుదెసలం బట్టెడి యాలవట్టంబులు; నా మనోరాగంబు నీకుఁ జెంద్రకావి వలువ; నీకుమ్రొక్క నెత్తిన నా చేతులు రెండును మకరతోరణంబులు; నాభక్తియె నీకు సింహాసనంబు; నామేనం బొడమిన పులకలు నీకు గుదులుగ్రుచ్చి యర్పించిన పూదండలు; నే నిన్ను నుతియించిననుతుల యక్షరరవంబులు నీకు భేరీభాంకార ఘంటా నినాదంబులు; నా పుణ్య పరిపాకంబులు నీకు నైవేద్యతాంబూలాదులు; మదీయ నిత్య సేవా సమయనిరీక్షణంబు నీకు సర్వాంగంబుల నలందిన తట్టు పునుంగు; నా సాత్త్విక గుణంబు నీకు ధూపపరిమళంబు; నీవు దేవుండవు; నే నర్చకుండను. ఈరీతి నిత్యోత్సవంబు నాయందు నవధరింపవే శ్రీ వేంకటేశ్వరా! మఱియును;

2

నందకాయుధధరా! నీ యాయుధంబులకు జయజయ; నీ వాహనంబులకు శుభమస్తు; నీ పరివారంబులకు క్షేమంబు గోరెద; నీకళ్యాణగుణంబులకు నిరంతరాభివృద్ధియగుఁగాక; నీ సత్త్వంబులకు శోభనపరంపరావాప్తియెసగవలయు; నీ దేవులకు మంగళ మహాశ్రీలగు; నీమహిమకు ననంతవివిధార్చనము; నీ భుజాబలమునకు నపరిమితస్తోత్రము; నీ చక్కఁదనంబునకుఁ బుష్పాంజలి; నీ యుదారతకు శరణంబు; నీ శ్రీవత్సకౌస్తుభాది చిహ్నంబులకు సంతతప్రార్థన; నీపాదం