పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

1. వచనరచన

అంధ్ర వాఙ్మయమునఁ బ్రాచీన కాలమున వచనకావ్య రచనమంతగాఁ గానరాదు. భారతాదికృతులలోఁ బద్యరచనముల నడుమ నెడనెడఁ గానవచ్చు వచనరచనలేకాని వచనైకరచనలు చాలఁ దక్కువ. పద్యైకరచన లంతకింకను జాలఁ దక్కువ. తిక్కన నిర్వచనోత్తరరామాయణమొక్కటే యట్టిది పేర్కొనఁదగినది. సంస్కృతమునఁ బద్యైక రచనలే యెక్కువ. చంపూరచన లంతకుఁ దక్కువ. గద్యైకరచనలును దక్కువే. దక్షిణదేశభాషలలోఁ గర్ణాటకమున నొకతీరు గద్యరచనలు చాలఁగలవు. అవి ప్రాయికముగా వీరశైవులు భగవత్ప్రార్థనాతత్త్వార్థ నిరూపణపరములుగా రచించినవి. అట్టి రచనలఁ బెక్కింటినిజేర్చి గర్ణాటకులు ' వచన శాస్త్రము ' అనుపేరఁ బేర్కొనిరి. కొన్ని సంపుటములుగా నిటీవల వానినిఁ బ్రకటించిరి. కన్నడమున నాయారచనము లించుమించుగాఁ బండ్రెండవశతాబ్ది నుండి యారంభమయిన వనవచ్చును. ద్రవిడమునఁ బ్రాచీనకాలమున వచనైకరచనలు లేనేలేవట! వ్యాఖ్యాన రూపవచనరచనము లుండుఁగాక యవి వచనకావ్యరచన లనఁదగనివి.

సంస్కృతమున వచనరచన ముత్తెఱఁగులని వామనుఁడు కావ్యాలంకార సూత్రమున నిట్లు చెప్పినాఁడు.

"కావ్యం గద్యం పద్యంచ. గద్యం వృత్తగన్ధి చూర్ణముత్కలికా ప్రాయంచ; పద్యభాగవద్వృత్తగన్ధి. అనావిద్ధలలితపదం చూర్ణమ్. విపరీతముత్కలికాప్రాయమ్.” అని

పద్యపాద భాగములకలయికతో వృతములవాసనఁ దోపించు చుండు వచనరచనము వృత్తగన్ధి. దీర్ఘసమాసముల గడబిడలులేక తేలిక పలుకులతోనుండు పొడిపొడి వచనరచనము చూర్ణము. దీర్ఘసమాసముల గడబిడలు గలిగి, యుద్ధతోక్తులతో నుండు రచన ముత్కలికా ప్రాయము. ననీ;

A