Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

సింహగిరి వచనములు

నైతిని. ఆధమాధముండనైతిని. అందని ఫలముల కఱ్ఱులుసాచితిని. దుష్ట దురాచారుండనైతిని. మూఢుండనైతిని. చపలుండ నతిపాతకుండను. మహాపాతక విశ్వాసఘాతుక పంచమహాపాతకుండను. అరణ్యమున దిరిగెడు మృగంబువలె తన నీడకుఁ దా నదరిపడుచు, నజ్ఞానంబనియెడు చీకటిం దప్పుకొనుచు నాచార్యకృపకుఁ జేరనీయక, భాగవత కైంకర్యమున కీడేరక, మోక్షార్తుండ గానేరనైతిని, కామాతురుండనైతిని. కూపములో బడిన శిశువువలెఁ గూయుచున్నాఁడను. తల్లి లేని బిడ్డవలె కలవరిఁచుచున్నాఁడను, తైలములోని మక్షికముచందం బాయెను. ఉరిఁబడ్డ మెకంబువలె నుపాయ మెఱుగక యున్నవాఁడను. పసిరిక కాయ పురుగువలె తేలలేక సంసారబంధములఁ దగులువడి, వికల్పగుణాదుల కెదురు గాననేరక వితరణ చెడి విరజానది దాట నుపాయంబు చాలక వారకాంతల రుచులందగులుచు, ప్రాకృతముచెలిమి విడువలేక లజ్జాభిమాన కులాభిమాన దేహాభిమానంబులు ఖండించనేరక వారకాంతలవలనం జిక్కువడితిని. నా కేది యుపాయము చెప్పవే దైవమా! నీ వుత్తమసాత్త్వికుండవు. సకలాచార్యుండవు, జగదీశ్వరుండవు, సర్వజీవ దయాళుండవు. పవిత్రుండవు, వాలినిగ్రహుండవు. విభీషణ ప్రతిష్ఠాపనాచార్యుండవు, రావణగిరి వజ్రాయుధండవు. ద్రౌపదీమానరక్షకుండవు. పదునారువేల గోపస్త్రీ ప్రియుండవు. తాటకాప్రాణాపహారా! లక్ష్మీమనోహరా!అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! ఆదిపురుషా! పురాణపురుషోత్తమా! వేదవేదాంతస్వరూపా! పరబ్రహ్మస్వరూపా! పరతత్త్వపరమప్రకాశా! పరమపదనివాసా! శరణాగత రక్షామణీ! శరణాగత చింతామణీ! పరంజ్యోతీ! సింహాచలనాథా! నీకు విన్నపము చేయుచున్నాఁడను. ఎనుబదినాలుగు లక్షల జంతురాసుల దొంతులను అనేక యోనిముఖముల వెడలితిని. ఆ కర్మలను సుఖదుఃఖచరితుండనై యనుభవించితిని. యముని వశంబున నెంతకాలము వృధయాయెను జన్మము! తర్కవాదంబు లనెడు కూపంబుల మునుగుచుం దేలుచు, మగుడ జన్మాదుల జన్మించుచు నూరికిం బాటకుం జోటికి వెడతాకుచును, నంత్యమున నరజన్మమున జనియించి యంధుండనై కొన్నివర్షంబు