పుట:Sinhagiri-Vachanamulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

సింహగిరి వచనములు

యితరముఁదలంచక సంసార మోహభ్రాంతి విడిచి సింహగిరిం దలంచి పరమ పదమున కేగుమా చిత్తమా, స్వామీ సింహగిరి నరహరీ,నమో నమో దయానిధీ!

10

దేవా, శమదమాది గుణంబులు గలిగిన బ్రాహ్మణుం డుత్తముఁడు. శమదమాది గుణంబులు గలిగిన క్షత్రియుం డుత్తముండు. శమదమాది గుణంబులు గలిగిన వైశ్యుం డుత్తముండు. శమదమాది గుణంబులు గలిగిన శూద్రుం డుత్తముండు. అతండే ముఖ్యుండు. ఎట్టి పురాణవాదనలు విన్న నేమి? సకల మెఱిఁగి యెఱుఁగక మార్గమునందు సందుగలిగి యితరముగా నాచరించెడు జంతువున కేది గతి? అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

11

దేవా, విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము సేయునతండె కులజుండు. శ్వపచుండైన నేమి? ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటె నతఁడె కులజుండు. దృష్టిం జూడగా విద్వజ్జన దివ్యభూషణము, సింహగిరిం దలంచిన యాతండె కులజుండు. సంధ్యాది నిత్యకర్మానుష్ఠానంబులు దప్పక నడిపిన నేమి? చతుర్వేద షట్ శాస్త్రముల్ సదివిన నేమి? శతక్రతువు లాచరించిన నేమి? సకలధర్మంబులు సేసిన నేమి? మా సింహగిరి నరహరిదాసులకు దాసు లైనం గాని లేదుగతి, స్వామీ సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

12

దేవా, నిర్గుణ వస్తువైన మీ మహత్వంబెన్న నగోచరంబు. శతబ్రహ్మ కల్పంబులు చనిన మీఁదటఁగదా రోమజుని కొక్కరోమంబు ఛేదంబగుట! ఇట్టి రోమజులు నూటెనమండ్రు చనిన మీఁదటఁగదా మీనజుని కొక్క