పుట:Sinhagiri-Vachanamulu.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

ధాన్యంబు మీద కడు తత్పరత్వముండెనేని వెనుకటిజన్మంబున శోణకంబై జన్మించును. దేవా. వావివరుస నెఱిఁగియెఱుఁగ నడచిన మనుజుండు వెనుకటిజన్మంబున వారకాంతయై జన్మించును. దేవా, తనపురుషుండు దైవంబని యెఱిఁగి యెఱుఁగక యెదురుమాట లాడిన కాంత వెనుకటి జన్మంబున గ్రామసూకరంబై జన్మించును. దేవా, హరికీర్తన మరోచకం బని, పరదైవతము కీర్తనము వినిన మనుజుండు వెనుకటిజన్మంబున చెవిటివాఁడై జన్మించును. దేవా, వివాహంబులు చెఱిచిన మనుజుండు వెనుకటిజన్మంబున సంతానంబుఁ (బొంద) లేకపోవును. దేవా, కులమున నేనే ఘనుండనని గర్వించిన మనుజుండు వెనుకటిజన్మంబున కులహీనుండై జన్మించును. దేవా, చదువుల నేనే ఘనుండనని గర్వించిన మనుజుండు వెనుకటిజన్మంబున మతిహీనుండై జన్మించును. దేవా, రణమందున నేనే పరాక్రమశాలినని గర్వించిన మనుజుండు వెనుకటిజన్మంబున వైశ్యుండై జన్మించును. దేవా, రణమందు పారివచ్చిన మనుజుండు వెనుకటిజన్మంబున పిశాచంబై జన్మించును. దేవా, రణముపొడిచిన మనుజుండు వెనుకటిజన్మంబునరాజై జన్మించును. దేవా, రణమందు తన్నేలిన రాజుకొఱకై చచ్చిన మనుజుండు వెనుకటిజన్మంబున నారాజు కడుపుననే పుట్టి యాపట్టణం బేలును. దేవా, షోడశమహాదానంబులు హరికి పుణ్యంబని చేసిన మనుజుండు వెనుకటిజన్మంబున మోక్షమే పొందును. దేవా, తనకు పుణ్యంబని చేసిన మనుజుండు వెనుకటిజన్మంబున మాయల, నింద్రమాయల పదునారింటికి గురియై ముక్తికిం దెరువుచూడనేరడు. దేవా, మూలమంత్రమున తూలిన (మనుజుండు) తైలమందు వటపిటశాస్త్రమందణురేణువుపాటియగ్ని సంధించిన చందం బగును. దేవా, శ్రీవైష్ణవులే బ్రాహ్మణులు, శ్రీవైష్ణవులే పరమసాధకులు, శ్రీవైష్ణవులే శోభితశుభదాయకులు, మీకులగోత్రం బెన్న నేమిటికి ? మీదాస్యంబె కారణంబు. మీదాస్యంబె వివాహంబు. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ!