పుట:Sinhagiri-Vachanamulu.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

సింహగిరి వచనములు

1

దేవా. ఇంద్రాదిదేవతలు నూఱును, హిరణ్యగర్భు లిన్నూఱును, కాశ్మీరగిరులు మున్నూఱును, తిలదాంచనగిరులు నన్నూఱును, పతివ్రత లేనూఱును, అగ్రహారంబు లాఱునూఱ్లును శ్రీ మూర్తు లేడునూర్లును, ఉభయస్తోమకు లెనిమిదినూర్లును, హేమశ్రీగర్భంబులు తొమ్మిదినూర్లును, కపిలధేనువులు వేయిని, కాలచక్రంబులు లక్షయును, తులాపురుషంబులు కోటియును, కన్యకాదానంబులు పదికోట్లును, నివియన్నియుఁ గూడిన మీ దివ్యనామసంకీర్తన వినినందులకు వేయిలో నొక్కభాగంబునకు సరి గావు. ఈ సంకీర్తనఫలం బెవరు వ్రాసిరి, యెవరు చదివిరి, యెవరు వినిరి, వారి కాయురారోగ్యైశ్వర్యంబులు కృపచేతువు, అటుమీదట నా కిచ్చిన వైకుంఠంబు కృపచేతువు. మాయతి రామానుజమునివరము. దాతారు. అనాథపతీ స్వామీ, సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ.

2

దేవా, వేయిపుణ్యంబులు సేసి నరుండై జన్మించును. దేవా, రెండువేలు పాపంబులు సేసి స్త్రీయై జన్మించును. దేవా, మూఁడు వేలు పాపంబులు సేసి యంగడివేశ్యయై జన్మించును. దేవా, నాలుగువేలు పాపంబులు సేసి యొకరింటిదాసియై జన్మించును. దేవా, అయిదువేలు పాపంబులు సేసి యాడుచు పాడుచు నగ్నిలో దుమికెడు కన్యయై జన్మించును. దేవా, ఆఱువేలు పాపంబులు సేసి సుంకరివాఁడై జన్మించును.