పుట:Sinhagiri-Vachanamulu.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

(4) " దేవా ఏనరుండై ననేమి శ్రద్ధాగరిష్ట చిత్తుండై నిన్ను సేవించునట్టి మహాత్ముండు విధిచోదితంబయిన ప్రమాణబహుళ విముక్తుండై వర్తించునట్లు గావున యోగీశ్వరేశ్వరుండవై ననీ వీళితవ్యులమైన మమ్ము నిష్పాపులం జేయుమని నుతించి మఱియు నిట్లనియె" భా. ద, ఉత్తరభాగం. 1151,

(5) "దేవా నీ సచ్చరిత్రంబులు కర్ణరసాయనం బులుగా నాకర్ణించుచు నీకుంబూజ లొనర్చుచు నీ చరణారవిందంబులకు వందనంబులు సేయుచు నీదివ్య నామకీర్తనంబులు సేయుచు......మఱియు నిట్లనియె. “నీకు మ్రొక్కెద కృష్ణ నిగమాంత సంవేద్య' భా.ద. ఉ 1196.

తాళ్ళపాకవారు

మొట్టమొదట తాళ్ళపాక చినతిరుమలాచార్యులు తన సంకీర్తన లక్షణంలో కృష్ణమాచార్యుల్ని పదకర్తగా ప్రశంసించాడు. ఆయన వచనాలనే కావచ్చు చూర్ణికలని పేర్కొన్నాడుకూడాను. తమతాత అన్నమయ్యగారు సంస్కృతంలో చెప్పిన సంకీర్తన లక్షణాన్ని తన తండ్రి 'పెద తిరుమలాచార్యులవారు వ్యాఖ్యానిస్తే తద్వ్యాఖ్యానుసారంగా తెలుగు పద్యాల్లో వ్రాస్తున్నానంటాడు చిన తిరుమలా చార్యులు. అంచేత కృష్ణమాచార్యుల్ని సంస్కృత సంకీర్తన లక్షణంలో అన్నమయ్యగారే ప్రశంసించి ఉండవచ్చునేమో. తిరువెంగళనాథుడు తెనుగు వేదప్రణేతగా ఆచార్యులవారికి ఆంజలిస్తాడు. ఈ స్మృతి ప్రశంసలేకాక తాళ్ళపాక వారి రచనల్లో కృష్ణమాచార్యుల ప్రభావం ప్రస్ఫుటంగా కనబడు తోంది.

"శ్రీ వైష్ణవుడే పరమసాధకులు
శ్రీ వైష్ణవులే బ్రాహ్మణులు
హరిభక్తి లేని విద్వాంసుని కంటెను
హరికీర్తనము సేయు నతడు కులజుండు
శ్వపచుండైన నేమి ఏవర్ణం బైన నేమి
ద్విజుని కంటె నాతండు కులజుండు"