పుట:Sinhagiri-Vachanamulu.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

శఠకోపుల తమిళవేదం శరకోప విన్నపాలకు మాతృక కాదు

శఠకోపముని ద్రావిడ వేద స్వరూప స్వభావాలు వేరు. ఈ విన్నపం తీరు వేఱూను. నామ సంకీర్తనం, శరణాగతి, నైచ్యానుసంధానం తప్ప ఇందులో అనుస్యూత వస్తువులేదు. ఇదే కాదు ఏ విన్నపాలు, వచనాలూ అయినా ఇంతే. అనుస్యూత వస్తు సూత్రం అందులో ఉండదు. ఇవి కొంత వఱకూ శతకధర్మాల్ని ముక్తక లక్షణాన్ని కలిగి ఉంటాయి. శ్రీశఠకోపుల తమిళ వేదమని ప్రశస్తమైన “తిరువాయ్ మొళి"కి ఒక రచనా ప్రణాళిక, వస్తు గాంభీర్య వైవిధ్యాలూ ఉన్నాయి. ఆయన వాజ్మయం అంతటా అంతర్వాహినిగా మధుర భక్తి శ్రవంతి ప్రవహిస్తూంటుంది. భగవంతుణ్ణి నాయకుడు గాను, కవి తనను నాయికగానూ భావించుకొని అక్కడక్కడ ఆ పారవశ్యం తోనే దూతీ, సఖీ, దుహితృమాత్రాది భూమికల్ని భావించుకొంటూ దివ్యభావ కమనీయ మహనీయంగా వెలయించిన కావ్యం అది. ఆ గాంభీర్యంవేఱు, ఆ సారస్యం వేఱు. ఆ చమత్కారం వేఱు, ఆ రామణీయకంవేఱు, ఆ శిల్పం వేఱు , ఆ భక్తి మాధుర్యమే వేఱు. అది అదే! అది ఇంకోటికాదు: దానిలా ఇంకోటిలేదు. రాదు. ఇట్లాంటి శఠకోప వాజ్మయానికి ఈ 'మచ్చుతునక 'విన్నపం అనువాదమేకాదు, ఛాయామాత్రాను సరణంకూడా కాదు! కృష్ణమాచార్యుల సింహగిరి నరహరి వచనాల ప్రభావంవల్ల ఆవిర్భవించిన వైష్ణవ పరమైన 'విన్నపముల'లో ఒకటి అది. దానికి శఠకోఫవిన్నపములు అన్న పేరు పొరపాటున వచ్చి ఉండవచ్చు. రెండవ శఠకోప విన్నపాలను పట్టి రావచ్చు. ఒక శఠకోపనాముడైన ఆర్వా క్కాలికుడు వ్రాసుకొన్నందువల్ల రావచ్చు.

ముద్రిత శఠకోప విన్నపాలు

కృష్ణమాచార్య వచనాలు తెలుగులో ప్రచారంలోకి వచ్చేక తమగురువునో ఇష్టదైవాన్నో ప్రశంసిస్తూ వచనాలు, విన్నపాలు వ్రాయటం తెలుగు లో శ్రీవైష్ణవ సంప్రదాయంలో పరిపాటి అయింది. ఇట్లాంటివే రెండో(సమగ్ర) శఠకోప విన్నపములు.. వీటి రచయితా కృష్ణమాచార్యులే. అయితే మన కృష్ణమాచార్యులు కాదు. ఆయన దీవికృష్ణమాచార్యులు: