పుట:Sinhagiri-Vachanamulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఆంధ్ర ప్రజ ఉపేక్షించటం మరీ సహింపరానిది. ద్రావిడాభిజాత్యంగల శ్రీ వైష్ణవకుటుంబాల వారూ, వర్ణవ్యవస్థమీద అవర్ణ్యమైన భక్తిశ్రద్ధలుగల అగ్రవర్ణాల విద్వాంసులూ, చివరకు నేటి పరిశోధకులూ, 'సంపాదకులు' కూడా ఏదోరకంగా తెలిసో తెలియకో ఆయనపట్ల అపచారపడుతున్న వారే.

శ్రీ విశ్వనాధ - విచిత్రచర్య

ఈ సందర్భంలో “ఒక విచిత్రోదంతం." ఆంధ్రప్రజల ముందు విన్నవించుకొంటున్నాను. ఆంధ్రసాహిత్య అకాడమీవారు కళాప్రపూర్ణ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ (ప్రభృతుల) గారి సంపాదకత్వంలో “ఆంధ్ర గద్యచంద్రిక " అని ఉదాహరణ ప్రాయమైన ఆంధ్రవాజ్మయ గద్యభాగ సంకలన గ్రంథం ఒకటి ప్రచురించేరు. ఇంతకు ముందే ఎప్పుడో ప్రధమాంధ్ర వచన కావ్యరచయితగా పేర్కొనబడ్డ కృష్ణమాచార్యుల వచనం మచ్చుకు ఇందులో లేకపోవటం ఆంధ్రత్వానికి గర్వకారణం ! సంపాదక వర్గ నాయకులు ఆంధ్రప్రభుత్వాస్థాన కవులు: గ్రంథం ప్రకటించినవారు పరిగణింపబడ్డ ఆంధ్ర సాహిత్య అకాడమీవారు: పుస్తకమా ఆంధ్రగద్య చంద్రిక: ఈ ఆంధ్రత్రివేణీ సంగమంలో అవగాహనం మాట అలా ఉంచండి పుడిసెడు తీర్థం పుచ్చుకొనేందుకు అర్హత సంపాదించుకోలేకపోయేడు ప్రధమాంధ్ర వచనరచయిత. ఈ చంద్రికలోనే చూడలేకపోతే ఎక్కడో మారుమూల చీకట్లలో ఉన్న సింహగిరివచనాల్ని అసలు చూడగలరా తెలుగుజనం. ఇందులో అజ్ఞాత కర్తృకాలూ అర్వాక్కాలికాలూ అయిన 'భవానీ మనోహర వచనాలు' మొదట ఇచ్చేరు. ఈ ప్రాథమ్య హేతువు తెలపలేదు. తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వైరాగ్యవచన మాలికాగీతాల్లోని తొలి వచనం అజ్ఞాతకర్తృకంగా రెండోదిగా ఇచ్చారు. మరీ అర్వాక్కాలికమూ దీవి కృష్ణమాచార్య కర్తృకమూ అయిన 'శఠకోపవిన్నపముల'లోని ఒక విన్నపం మూడోదిగా ఇచ్చేరు. నేనెరిగినంతవఱకూ చివరి రెండూ ముద్రితాలు. వీటి రెండింటి మీదా కృష్ణమాచార్యుల ప్రభావం ప్రస్పుటంగా ఉంది