పుట:Sinhagiri-Vachanamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

కోసమూ తెలుగుదేశంలోని వైష్ణవుల పట్ల వారెంతటి మహత్వాతిశయం కలవారైనా చిన్న చూపుతోనూ కల్పించిన కట్టుకథ యిది. ఆచార్య సంప్రదాయం విషయంలో కృష్ణమాచార్యులు ఏ శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రతిష్ఠాపనాచార్యులకూ తీసిపోయేవారుకాదు. ఇది ఆయన వచనాలు చూచినవారికి తెలుస్తుంది. అంచేత ఆచార్య సూక్తిముత్తా వళికథ ప్రామాణికంగా పరిగణింపబడే అవకాశం లేదు. అహోబలంలోని నాట్య వినోదులైన పొతకమూరి భాగవతుల జాడ చారిత్రకంగా నిరూపింపబడేవఱకూ, కృష్ణమాచార్యులకు ప్రతాపరుద్రుడిచ్చేడను కొంటున్న “ ఏభై ఊళ్ళరాజకీయాధికార శాసనాలు బయటపడేంతవఱకూ, ఇంకా ఏమైనా ఆంతరంగిక సాక్ష్యం చెప్పగల వచనాలు కొత్తవి ఆయనవి బయటపడేంతవఱకూ, ప్రస్తుతం ప్రతిపాదింపబడుతున్న జన్మ సంవత్సరాన్ని అంగీకరించటంలో బహుళః ఏ విప్రతిపత్తీ ఉండకూడదు. ఏతావతా కృష్ణమాచార్యుల జన్మ సంవత్సరం క్రీ౹౹ శ ౹౹ 1230 వికృతి, 1246 పరాభవ సంవత్సర ఆషాఢ శు౹౹ ద్వాదశినాడు దండెయు చిఱుతాళములు ధరించి సింహగిరి నరహరి సన్నిధిని ఆయన సంకీర్తనం ప్రారంభించేరు.

తామ్ర పత్రాల సంగతి

ఓరుగంటిని కృష్ణమాచార్యులు సందర్శించి ఉండటానికి అభ్యంతరం ఏమీలేదు, ఆయన 'భూప్రదక్షిణం' చేసేరు. శ్రీరంగాది దివ్యక్షేత్రాలూ సందర్శించేరు. ఆ సందర్భంలో ప్రతాపరుద్రుణ్ణి చూసి సమ్మానాలూ పొంది ఉండవచ్చును, రాజకీయాధికారమూ చెలాయించీ ఉండవచ్చును. అయినా ఆయన మనస్సు సింహగిరిమీదే ఉంది. అందుచేతనే కావచ్చు మూడేళ్ళు అధికారం చేసి సొమ్మంతా కూడబెట్టి తామ్రపత్రికలు చేయించి తన చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలు వాటిమీద చెక్కించి స్వామికి సమర్పించటంకోసం, బళ్ళకెక్కించి సింహాచలానికే తరలించి ఉంటారు. ఆయన సింహాద్రినాధుణ్ణి కూడా శ్రీరంగశాయి అంటారు. ప్రతి శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాన్ని "తిరుపతి" అన్నట్లు, ప్రతి విష్ణు క్షేత్రమయిన కొండనూ “తిరుమల" అన్నట్లు శ్రీవైష్ణ