Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


జీవితకాలంలోనే, ఆయన సంస్మరణమైనా లేకుండా, సంకీర్తన సంప్రదాయ పరిరక్షణం కోసం శాసనం పుట్టటం సంభావ్యంకాదు. అందుచేత ఈ శాసన బలాన్ని పట్టికూడా కృష్ణమాచార్యుల జన్మవర్షం క్రీ౹౹ శ౹౹ 1230 గా ప్రస్తుతానికి పరిగణిచంటంలో విప్రతిపత్తి ఉండకూడదు.

ఆచార్య సూక్తి ముక్తావళి - అంతరార్ధం

ఇది యిలా గుండగా శ్రీ వైష్ణవ సంప్రదాయ చారిత్రక గంథం- "ఆచార్య సూక్తి ముక్తావళి"లో కృష్ణమాచార్యులు శ్రీ మద్రామానుజులకు సమకాలికులుగా చిత్రింపబడ్డారు. అదే నిజమైతే ప్రథమాంధ్రకవి నన్నయ గారికి సద్యస్సమనంతరకాలికు లౌతారు ప్రథమాంధ్ర వచనకవీని, కాని యీ ప్రతిపాదనం అంతరంగ బహిరంగ సాక్ష్యాలకు రెండింటికీ విరుద్ధంగానే కనబడుతోంది. చివరకు సిద్ధాంతం ఏమయినా కేవలం ప్రతాప చరిత్రబలంతో ఆచార్య సూక్తి ముక్తావళి ప్రతిపాదనాన్ని త్రోసిరాజన్న వారు కొందరూ, అసలు అదొకటి ఉన్నదని కూడా తలవనివారు మరి కొందరూను మన విమర్శకులు. చారిత్రకంగా కృష్ణమాచార్యుల కాలనిర్ణయంలో ఆచార్య సూక్తి ముక్తావళి అంగీకృత ప్రమాణంకాకపోయినా ఆయన జీవిత సత్యాలనీ, సిద్ధాంతాలనీ నిరూపించేందుకు ఉపయోగపడుతుంది. ఇది విమర్శకులు గ్రహింపలేదు. సింహగిరి నరహరీ వచనాల అంత స్సాక్ష్యాన్ని జట్టి ఆచార్య సూక్తి ముక్తావళి విలువల్ని ఈ సందర్భంలో విమర్శించటం అవసరం. కృష్ణమాచార్య వాజ్మయాన్ని పట్టి ఆయన శ్రీ మద్రామానుజుల పట్ల ఎల్లప్పుడూ అపారమైన భక్తి విశ్వాసాలు కలవారని తెలుస్తోంది. సింహగిరి నరహరితో పాటు యతిపతి రామానుజులు, కృష్ణకువ్వారు, రాఘవేశ్వరుడు వీరు ముగ్గురూ ఆయనకు దైవ సమానులు. ఈ భక్తి సర్వకాల సాధారణం, ఇట్లాంటి కృష్ణమాచార్యులు ఒకప్పుడూ రామానుజులను “వట్టి సన్యాసి" గా భావించరు. ఇక శ్రీమద్రామానుజులా ఆయన ఉదాత్త గంభీరులు. ప్రాణికోటి పట్ల ఆయన కరుణ అపారం గోష్ఠి పురగోపురం మీద నిలిచి మంత్రార్ధవితరణం చెయ్యటం ఆయన ఔదార్యానికీ కరుణకూ తార్కాణ. అంతేకాదు ఆత్మోత్తారణం కంటే పరోద్దారణానికి ఆయన తపనకు పరమో దాహరణ .