పుట:Sinhagiri-Vachanamulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

సింహగిరి వచనములు

నూటయెనిమిది తిరుపతులను స్వామి తిరుమేను నందవ(ధ)తరించితిమి గాక! కావేరి రంగనాథుని అన్నిటను వహించి మిగిలిన శేషము స్వామి తిరుమేనునందు కలిసితిమి గాన ఈ సంకీర్తన యెవ్వరు పఠియించిన వారికి ఆయురారోగ్యము. ఈ గ్రంథస్వరూపము. ఇదియే వంశము. ఇదియే గోత్రము. ఇదియే నాకు పుత్రమిత్రకళత్రాదులు. ఇదియే నాకు బాంధవులు. ఓం నమోనారాయణ యని పఠియించిన పరమభాగవతోత్తములకు శుభం భవతు. చాతుర్లక్ష సంకీర్తన యిదియే. పంచమవేద మిదియే, దివ్యమంత్ర మిదియే. ఈ నూటయెనిమిది నామములను ఎవ్వరు స్తుతియించినరేని వారలకు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదవులు కృపజేసి రక్షింతువు గాన అనాది(థ?)పతి, సింహగిరి నరహరి!

2

ఓమ్ భృగునారసింహ! ఓం జయనారసింహ! ఓం భార్గవ నారసింహన ఓం జ్వాలా నారసింహ! ఓం పరమయోగానంద పావన నారసింహ! ఓం భయనివారణ నారసింహ! ఓం దుఃఖనివారణ నారసింహ! ఓం శ్రీమన్నారాయణ నారసింహ! ఓం లక్ష్మీపతి నారసింహ! ఓం వరాహ నారసింహ! యను మీ దివ్యనామసంకీర్తన సమర్పించిన భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ చోర వ్యాఘ్రవరాహ భల్లూక సర్పవృశ్చిక సర్వజ్వరదోషాది భయంబులు తొలంగును. నరహరి! సింహగిరిపతీ! మీ దివ్యనామసంకీర్తన సర్వమైన పీడలను నివర్తించును. ఈ సంకీర్తన యే యింట నున్న నా యింటను ఏ ఆపదలు జొరవెరచును. ఎక్కడకైనను పయనమైపోవునపుడు ఈ సంకీర్తన వ్రాసి రక్షగా కట్టుకొనిన మోసకట్టు, దారికట్టు, వాకట్టు. ఈ సంకీర్తన పఠియించినవారిని జూచిన ఆవలవారికి అనేకంబై కనుపట్టును. అనేక భయంబులై తోచిఉండు. బ్రహ్మరక్షస్సు మొదలయిన భూతప్రేత పిశాచ గ్రహపీడలు చొరవెరచును. ఉగ్రహా! ఉగ్రనారసింహ స్తోత్రము పరమ మంత్రోచ్చారణంబు. అనాథపతి సింహగిరి నరహరీ నమో నమో! (దయానిధీ!)