పుట:Sinhagiri-Vachanamulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

5

ముప్పదికోట్ల విస్తారముసు, ఏడుకోటున్నర (ఏడున్నరకోట్లు?) పొడవుం గల దివ్యపదంబై న పరమపదంబు బొడగని, అనంతములైన సాష్టాంగములు చేయుచున్న, అనంతకోటి సూర్యప్రకాశంబున ప్రజ్వరిల్లెడు పొడ గనిన నన్ను త్రింశత్కోటి ద్వారపాలకుల సేవించిన, ఆ త్రింశత్కోటి ద్వారపాలకులు ఎదురుగా జనుదెంచిన ఆ భాగవతులకు దండప్రణామంబు లాచరించి అనేకకాలమునాటి బంధువులు వేంచేసిరని, మహావైభవంబులతోను పరమపదములోపలికి వేంచేయుడన్న ఆ పరమపదములోపలి మణిగోపురము, మణిధ్వజమణిప్ర(ప్రా)కారము జేగీయమానంబులైన చిత్రజాలకంబులైన తిరువీథులు, అనంతకోట్లు తిరువీథులవెంట చనుదెంచెడి సమయంబున అధ్యాంతరారంబున (ఆభ్యంతరంబున?) రత్నాలసావడి గలదు. ఆసావడి మీదను సాలోక్య, సామీప్య, సారూప్యధారులు సహస్రకోట్లు వేంచేసియుందురు. ఆరత్నాలసావడికి ప్రదక్షిణాకారంబు చేసివారల యనుమతిని మూడు ముహూర్తంబులు ఆ రత్నాలసావడింగూర్చున్న సమయంబున అక్కడ సర్వేశ్వరుని శ్రీనగరిలోపల వేంచేసియున్న దివ్యపురుషులు సహస్రంబులు ఆ రత్నాలసావడి జనుదెంచ అందున్న భాగవతులం బొడగని సర్వాభరణభూషితులుంగా నలంకరించి దివ్యవిమానారూఢులం జేసి ఓం.............పరమపదమనియెడి వైకుంఠంబు తిరువీథులయందు చనుచుండగా పుష్పవృష్టి సాంద్రమై వర్షింపగా వైకుంఠ తిరువీథులయందు ఏగుదెంచెడి సమయంబున ఆ పరమపదమందున్న నిత్యముక్తులు ఎదురుగా జనుదెంచి తమతమ తిరుమాళిగకు తోడ్కొనిపోయి ముత్యాలగద్దియపై గూర్చుండబెట్టి పసిండిచెంబుల తిరుమంజనంబులు తెచ్చి ఆభాగవతోత్తముల శ్రీపాదతీర్థంబుల జేర్చుకొనియున్నంత అక్కడికి జగదీశ్వర సన్నిహిత దాసులు సహస్రకోట్లు ఎదురుగా జనుదెంచి దివ్యవిమానంబులెక్కించి ఆపరమపదరాజులనగరి ద్వారంబున నిలువుంబి(లిచి?) నిలిపి యా నగరి ద్వారంబుముందరను తిరువాయిముడిమండపంబుగలదు. ఆ తిరువాయిముడిమండపంబు అయిదు లక్షల యోజనంబుల విస్తారమును, మూడు లక్షల యోజనంబుల పొడవును గలదు. ఆ తిరువాయిముడిమండపంబు (వాకిట?), ఋగ్యజుస్సామాధర్వణ అనుత్తలైన (వేత్తలైన?) వేదార్ధంబులు ప్రసంగించెడు హరిదాసులు అనంతకోట్లు ఉందురు.