Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

మొదటి అనుబంధము

1

దేవా, ‘ఏకో విష్ణుర్మహద్భూత’ మ్మనియెడి మీ స్మృతులు సుర లెరుంగుదురు. మీ శూరత్వంబసురులెరుంగుదురు. మీమీది భక్తి తాత్పర్యంబు ప్రహ్లాదుడెరుంగును. మీ మూలంబు రుక్మిణీదేవి యెఱుంగును. మీకు గంధం బొసంగుట కుబ్జ యెఱుంగును. మీ పరమ దయాళుత్వంబు గజేంద్రుండెఱుంగును. మీ బాలప్రభావంబు యశోదాదేవి యెఱుంగును. మీ బాలస్నేహంబు కుచేలుండెఱుంగును. మీ కృప ఘంటకర్ణుడెఱుంగును. మీ మహత్వంబు విశ్వామిత్రుడెఱుంగును. మీ శాంతి శమదమాది గుణంబులు భృగుండెఱుంగును. మీరు కుంటెన నడచినతనంబు తొండరడిపొడి యాళ్వారెరుంగుదురు. మీ విలువిద్య యింద్రధనస్సు ఎరుంగును. మీ తెంపు వైనతేయుండెరుంగును. మీ (జి)హ్వ రుచి విదురుడెరుంగును. మీ పండు ఫలంబుల రుచి శబరి యెరుంగును. మీ పరాక్రమంబు రావణుడెరుంగును. మీ సత్యంబు విభీషణుండెరుంగును. మీ కిరనుకొన్న స్థలంబు వైకుంఠంబెరుంగును. మీరు శయనించిన స్థలంబు క్షీరాబ్దియెరుంగును. మీరు పోషించిన భావంబు శేషుండెఱుంగును. మీ హస్తంబుల రుచి యమృతంబెరుంగును. మీ వాక్కుల రుచి పురుషసూక్తంబెరుంగును. మీ కంఠంబుల రుచి కౌస్తుభమణి యెరుంగును. మీ నాసికంబుల రుచి పారిజాతంబెరుంగును. మీ కన్నుల రుచి పరమ భాగవత ప్రపత్తి యెరుంగును. మీ భుజఫరాక్రమంబు శంఖ చక్రమంబులెరుంగును. మీ లలాటంబు (రుచి?) తిరుమణి శ్రీ చూర్ణంబులెరుంగును. మీ నామరుచి పార్వతీ దేవి యెరుంగును. మీఋగ్యజుస్సామాధర్వణవేదంబులెరుంగును. సనక, సనందన సనత్కుమార యోగీశ్వరులెరుంగుదురు. మిమ్ము పూజసేయ నేనెంతటివాడ. అధమాధముడ. నరపశువును. అజ్ఞానిని. నీవాపదుద్ధారకుండవు అనాథపతీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!