సింహగిరి వచనములు
45
చిత్తమా, కైవల్యమునకై నుతింపవే, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!
47
దేవా, పర్వతంబునకుఁబోయి శైవులగుదురు. తిరుపతులఁ జూచి వైష్ణవులగుదురు. శక్తిమతంబును జూచి కుశాలులగుదురు. ఇటువంటి మనస్సంచలనమునఁగదా రౌరవాది నరకగతియై యిహపరములు లేకుఁడుట. ఆత్మజ్ఞానులైన జనులే మతాభిమానులు. శాస్త్ర, వైరాగ్యములతో బాధలు చెప్పంబడు, వానినే యవలంబము చేయుదురు. ఈమత మామతమన దిరిగెడు నట్టి కుమతుల నేనేమందు. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!
48
దేవా, కోశమున నొంటరిగాఁజిక్కి యాక్రోశముఁజేసిన కోకిలం జూచి, కాకులు దాని నటునిటుఁ జననీకఁ జిక్కింపజేసిన క్రియను జిక్కు పడి యున్నాడఁను. సంసారతరంగములు మునుఁగు పడనడచిన తెలివిఁ బొందని జంతువును [1]ఝషాది నానావిధముల (జంతువులు) నారపీచువలె నన్నలమిపట్టియున్నవి. ఆకర్మ లనవరతము హరిభక్తిందేలనీయవు. ఈ జంతువునకు, గర్మములనణంచి సుకర్మిని జేయుమయా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!
49
దేవా, బహువిద్యలు (గల)వారినిగాఁజేసి బహురూపంబులఁ బొందజేయకు. ఏవర్ణమైననేమి? మీదివ్యనామ గుణసంగతి గలుగఁజేసి, మీ దాసానుదాసునిగాఁ జేయవే. కరుణాంబుధీ, శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!
- ↑ ఈషణాది