పుట:Sinhagiri-Vachanamulu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

సింహగిరి వచనములు

భాగవతులకుఁ దప్పుదును. ద్వారవాకిళ్ళసన్నిధిని జతుర్భుజంబులును శంఖచక్రగదాశార్ఙ్గఖడ్గాద్యధికారం బిత్తును. సర్వమును తిరునాళ్ళను తిరుమేనను దిరువక్త్రంబు దెరిచి యవధరింతును. ఇందుకు దప్పితినా, పరమపదనివాసుని పరంజ్యోతియైన స్వామికిఁ దప్పుదును. సర్వమునకును దప్ప’ నని సింహగిరినాథుఁడు శ్రీకృష్ణమాచార్యులకు నభయహస్తము గృపఁ సేసెను. అనుజ్ఞ ప్రసాదించెను. అప్పుడు కృష్ణమాచార్యుల విన్నపము నవధరించెను. ‘నేడు గదా, నేను భాగ్యము చేసితి’న(ని) వారిసాగరము లుబ్బినట్టివిధ మనుభవించెను. మహామేరువు శతయోజనములు పెరిగినట్లు కృష్ణమాచార్యులు పొంగెను. “నేడుగదా, పరమాచార్యులైన పొతకమూరి నారాయణయ్య యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, లక్ష్మయ్య, శ్రీచెన్నమయ్య గారల వలన పితృపితామహులకును, వైఖానసులకును, బ్రాకృతులకును, కనుగొని సేవించిన యార్య పెరియలకును[1], శత్రుమిత్రులకును, పరమపద మిప్పించి(తి)రి. కనుక వారి మాహాత్మ్యమువలన పరమపద మొకవరము జేసితిని. పరమపదనివాసుని గడు గుత్తఁగొంటిని. పరంజ్యోతి నామనంబున నిలిచెను. నేడుగదా పరమభాగవతుల శ్రీ పాదపద్మంబులు సేవింపగలుగుట! నేడుగదా, దాసానుదాసులకు దాసుఁడ ననగలుగుట! నేడుగదా, సింహాద్రినాథుని వాకిళ్ళు గాచెడు భాగ్యము గలుగుట! నేడుగదా, యతిరామానుజముని వరదస్వామి సింహగిరి యనియెడు దివ్యౌషధము నా హృదయమునకు దొరకుట! నేడుగదా నూటయెనిమిది తిరుపతులను వెలయంగలుగట! నేడు గదా, మీ తిరుమేను నవధరింప గలుగుట! నేడుగదా, కృష్ణమాచార్యుల గాచి రక్షింపగలుగుట! ఆర్తజనబాంధవా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, ఇంతే నా విన్నపము.

33

విష్ణూ, ముకుందా, ఆనంతా, భగవాన్, అచ్యుతా, నారాయణా, హరీ, మురారీ, శ్రీరామా, నిరంజనా, పరమా, పరిపూర్ణా, పరమేశ్వరా,

  1. శ్రీకార్యపరులకు?