పుట:Shriiranga-mahattvamu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

పంచమాశ్వాసము


క.

శ్రీరంగభర్తఁ గరుణాం
భోరాశి భజించి మగిడిపోవుచు నిచటం
బ్రారబ్ధకర్మఫలమున
భూరిజ్ఞాననిధి నిన్నుఁ బొడగనఁ గంటిన్.

169


ఉ.

వారనిదప్పిఁ దట్టువడువానికిఁ జల్లనినీరు నాకటం
గూరి కృశించు దీనునకుఁ గోరినయన్నముఁ జాల లేమిచే
నారటమందు పేదకు మహానిధియున్ సమకూరినట్లు వి
ద్యారతి నున్ననా కొదవెఁ దావకసంగతి పక్షిపుంగవా!

170


క.

వితతభవానలకీలా
ప్రతతి ననారతముఁ జాలఁ బరితప్తుఁడనే
కృతిమాలియున్న నాకే
గతి నిత్యసుఖావహంబు గలుగు మహాత్మా!

171


వ.

అనినఁ దద్వచనంబులకు సంతసించి శకుంతవల్లభుం డిట్లనియె.

172


ఆ.

మున్ను మునులు యోగముఖ్యులు నిగమాబ్ధి
తలఁపుఁ గవ్వములను దఱచి తఱచి
తనరఁ దెచ్చినట్టి తత్త్వామృతంబు నీ
కే నుపన్యసింతు మానవేంద్ర!

173


చ.

అవిరళకర్మపాశనిచయంబులచేఁ బ్రతిబద్ధుఁడై భవా
ర్ణవమున మున్గుచున్ భయమునందెడు కష్టపుదేహికిన్ నృప
ప్రవర! ముకుందపాదయుగపంకజసంస్మరణంబు దక్క నె
య్యవియు సముద్ధరింప నసమర్థము లన్ని దురుక్తులేటికిన్.

174


క.

కనుమూసి తెఱచినంతన
మునుకొని కాలంబు భూతముల ప్రాణంబుల్
గొనుఁగాన, మోక్షయత్నం
బనఘా! తడయక నొనర్పనగుఁ బ్రాజ్ఞులకున్.

175