పుట:Shriiranga-mahattvamu.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

217


య్యోజ సమకొనిన తెఱఁగు,సు
ధీజనవరులార! విస్మృతిం బడనేలా!

37


ఉ.

నావుడు సంతసించి నరనాథుఁడు ఋత్విజులున్ సదస్యులుం
బావనగంధపుష్పఫలపాయసపూపగుడాజ్యముఖ్యనా
నావిధసత్పదార్థకలనంబున నర్చ లొనర్చి రిమ్ములన్
సేవకకామితార్థఫలసిద్ధ్యవలంబము నాకదంబమున్.

38


ఉ.

భాతిగ నాకు నిప్పు డతిభక్తి నొనర్చిన యర్చనంబులం
బ్రీతుఁడ నైతి, మీవలనఁ బెద్దయు విప్రవరేణ్యులార! మీ
కీతఱి నిష్టమైన వర మిచ్చెద వేడుఁడు, నావుడు న్మనః
కౌతుకమార వారు పులకంబులు నెక్కఁగ నుద్గతాస్యులై.

39


మ.

క్షితిజాతోత్తమ! సర్వలోకపతి, లక్ష్మీమానసోల్లాసు, నా
శ్రితమందారు నుదారుఁ గౌస్తుభమణి శ్రీరంజితోరస్కు, న
చ్యుతునిన్ భక్తి గుఱించి యీనృపతి విధ్యుక్తంబుగాఁ జేయు స
త్క్రతురాజంబున కేము ఋత్విజులమై కర్మం బనుష్టింపఁగన్.

40


క.

ఏమంత్రము నేతంత్రము
మామతులకుఁ దెలివిపడక మానినకార్యం
బేమాయెనొ! యదిగాక మ
తేమాయెనొ! మే మెఱుంగ మేకారణమో!

41


క.

ఆవిధము దెలిసి మెఱసిన
మావిన్నదనంబు మాన్పి మంత్రనియోగ
ప్రావీణ్య మొసఁగి పూర్ణము
గావింపుము నీవు మఖ మఖండితకరుణన్.

42


చ.

అనవుడు నమ్మహావిటపియందు వసించిన రంగధాముఁ డి
ట్లను మునులార! మీ రలసి యధ్వరవాటిక నుత్కవాటబం
ధన మొనరింపఁగా మఱచి నల్గడలన్ సుఖసుప్తులైనచో
శునకము తన్మఖాలయముఁ జొచ్చి నిజేచ్ఛఁ జరించి యచ్చటన్.

43