పుట:Shriiranga-mahattvamu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

213


చ.

మునివర యీప్రదేశము సమున్నతయూపచయోపశోభితం
బును, బరిపూర్ణపాత్రపరిభూషితవేదివిరాజితంబునై
గనఁబడుచున్న దేనృపశిఖామణి సమ్మతిఁ జేసెనొక్కొ భూ
వినుత మహాధ్వరంబు లతివిశ్రుతదక్షిణ లిచ్చి యిచ్చటన్.

13


క.

అనవుఁడు నాగౌతముఁ డి
ట్లనియెన్ మిథిలాధినాథుఁ డైనవిదేహుం
డొనరించెఁ బెక్కుయాగము
లనఘ మహామునిసమేతుఁడై యచ్చోటన్.

14


ఉ.

నావుఁడుఁ బుట్టచూలి సుజనప్రియు గౌతముఁ జూచి సుస్వరం
బై వినవచ్చుచున్నది నిరంతరమై యొక వేదఘోష మీ
రావున నిట్టిచిత్ర మెచటన్ మును నే నెఱుఁగన్ మునీంద్ర! నీ
వావిధ మెల్ల నాకుఁ దెలియన్ వినిపింపు సవిస్తరంబుగాన్.

15


క.

అని యడిగినఁ బ్రాచేతస
మునివరుఁ డిట్లనియె గౌతముఁడు సకలజగ
ద్వినుతప్రభావభూసుర
వినుము పురావృత్త మొకటి వినిపింతుఁ దగన్.

16


శా.

భూనాథుల్ తనపంపు సేయఁగ జగత్పూర్ణప్రతాపోదయ
శ్రీ నొప్పారు విదేహభూమిపతి భూరిద్రవ్యదానంబులం
దీనానాథుల కెంతయుం బ్రియము సంధిల్లం బ్రయోగానుసం
ధానప్రౌఢిమ నీశ్వరానుమతి జన్నం బర్థిఁ గావింపఁగాన్.

17


క.

ఒకనాటి రాత్రి ఋత్విక్
ప్రకరముఁ బరిచారకులుకు బడలిన మేనన్
సకలంబు మఱచి నిద్రా
వికలేంద్రియు లగుచునున్నవేళం బెలుచన్.

18


చ.

అలరఁగ నొక్కకుర్కుర మనావృతభూరికవాటమైన త
త్సలలితయజ్ఞవాటము వెసం జనఁ జొచ్చి, తదంతరంబునం