పుట:Shriiranga-mahattvamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

తృతీయాశ్వాసము


సమేతంబు లగుపంచదళజాత్యవయవంబులఁ బరిశీలించి - స్థాయి సంచారి
ప్రముఖు లగుచతుర్వర్ణంబులు నాశ్రయంబుగా నెన్నఁబడిన ప్రసన్నాది
ప్రభృతికాలంకారంబులు పదుమూడును బరిస్ఫురింపఁ గంపితస్ఫురితాహతాం
దోళితంబులు లోనుగాఁ గల సప్తగమకంబులు మెఱయ నష్టాదశజాతి ప్రభూ
తంబులై శుద్ధభిన్న గౌళదేసరి సాదారి తోపరాగసంజ్ఞలఁ బ్రసిద్ధంబులైన
శుద్ధరాగంబులు ముప్పదియాఱును, రాగాంగంబు లిరువదియును, భాషాం
గంబులు నలువదియేడును, నుపాంగంబులు ముప్పదియొక్కటి,
త్రయాంగంబులు మూఁడునుగాఁ బదిదెఱంగుల నూటముప్పదియే డగురా
గంబులు వేళావిభాగంబుల నాలాపంబు సేసి సమతాళపదక్రమబంధురంబు
లగు నాసింధురవరదు బిరుదాంకితంబు లైన ప్రబంధంబులు పాడఁ దొడంగె -
నపుడు కర్ణామృతాయమానం బగుగంధర్వరాగంబు నాకర్ణించి—

295


సీ.

సెలవు లంబులు రాలఁజెవు లొగ్గి మృగములు
తరలక మేపులు దలఁగి నిలిచె,
గగనవీధులఁ బాఱు ఖగము లుపాంతభూ
జములపై వ్రాలి నిశ్చలత నొందె,
మంజులప్రాసాదమణికుట్టిమంబులు
గరిఁగి నీరై జాలుగట్టి పాఱెఁ
దరులతాపంక్తులు మరలఁ బ్రాయము వచ్చి
చిగురు గెమ్మోసులఁ జెలువు మిగులె


తే.

నచటి జనులెల్ల నితరకార్యములు దక్కి
సంతతానందపరవశస్వాంతు లగుచుఁ
జిత్రరూపులకైవడిఁ జేష్ట లుడిఁగి
యున్నవా రున్నచోటనె యుండి రపుడు.

296


మ.

కరుణాంభోనిధి రంగనాయకులు దగ్గంధర్వగాంధర్వవై
ఖరి చిత్తంబున కౌతుకంబు నెఱయంగా సుప్రసన్నాత్ముఁడై,
సరసోదారకటాక్షవీక్షణసుధాసారప్రసారంబునం
బరితాపం బడఁగించి వారి కొసఁగెన్ భవ్యార్జితైశ్వర్యముల్.

297