పుట:Shriiranga-mahattvamu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

143


నెవ్వగఁ జిత్తం బెరియఁగ
నవ్వనరుహగర్భుతోడ నతఁ డిట్లనియెన్.

243


క.

ఏమని చెప్పుదు లోకపి
తామహ! మత్సరము మానధనమును బాసెం
దామరసాక్షుని దూతల
చే ముల్లోకములు గేలి సేయుచు నవ్వన్.

244


వ.

అనినఁ జతుర్ముఖుండు శతమన్యున కిట్లనియె.

245


చ.

మెఱసిన మృత్యుదేవతకు మృత్యువులైన ముకుందదాసులం
దరలక మారుకొం టరయఁ దాఁ గొఱవిం దలఁగ్రోఁకుకొంట యి
ట్లెఱిఁగియు వజ్రమంది యిది యేటికి వైచితి వారిమీఁద నె
త్తెఱఁగుననైన నాపదలుఁ దెచ్చుఁగదా బలవద్విరోధముల్.

246


క.

అనిమిష విను నీకులిశం
బనఁగా నిది యెంత? మామకాస్త్రవరంబై
నను హరునిపాశుపతమై
నను వమ్మగు విష్ణుభూతనాధులచేతన్.

247


ఆ.వె.

కాలచక్రమైన గరుడధ్వజునిచేతి
చక్రమైన వారిఁ జేర కంత
దలఁగునట్టి మహిమ గలమహాత్ములతోడ
వైర మగుట నేమికారణంబు-

248


క.

అనిన పితామహుపలుకులు
విని యనిమిషనాయకుండు వినమితముఖుఁడై
మునుకనసిగ్గున దమ్ముం
గనుఁగొనుటయు, నతని తలఁపు గని గంధర్వుల్.

249


వ.

ఆచతుర్ముఖున కభిముఖులై కరపుటంబులు నిటలతలంబునఁ గదియించి
యిట్లనిరి-

250