పుట:Shriiranga-mahattvamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

తృతీయాశ్వాసము


మఱియును బెక్కుమాఱులు దక్షుండు ఋక్షాధిపతి నివ్విధంబున బోధించి
తత్కుటిల ప్రచారంబు వారింపం జాలక చాల రోపించి యతనిం గనుంగొని.

141


క.

దోషాకర! పలుమఱు-మ
ద్భాషలు గైకొనక చపలభావంబున ను
ద్వేషించితి గావునఁ ద
ద్దోషంబునఁ జెందు యక్షదుర్దశ నిన్నున్.

142


చ.

అని శపియించె నంత హరిణాంకుఁడు తత్సటురోగ ముగ్రమై
తనతనువందుఁ బొందఁ బ్రభఁ దప్పి కృశించి వినష్టబుద్ధియై
ఘనభయవిహ్వలుం డగుచు గ్రక్కున నక్కడఁ బాసి భూతలం
బునఁ గడువాసి నుల్లసిలు పుష్కరిణీతటిఁ జేర సన్మతిన్.

143


మ.

నిజశాపావధిఁ గోరి తద్విమలపానీయంబులం గ్రుంకి స
ర్వజగద్భూరితపంబు పంచదశవర్షంబుల్ ధృతిన్ సల్పి నీ
రజనాభుం బదివత్సరంబు లట నారాధించె భాస్వత్కర
వ్రజకించిద్వికసద్ధళాంచితతరస్వచ్ఛాంబుజాతంబులన్.

144


వ.

అంత.

145


క.

తద్విరచిత పూజనముల
హృద్వనజం బలర లోకహితమతి సార్ఖా
పద్విఘటనకరుఁ డగు దను
జద్విషుఁ డతికరుణ నతని సన్నిధి నిల్చెన్.

146


ఉ.

అప్పుడు కైరవప్రియుఁ డుదంచితసమ్మదవార్థివీచులం
దెప్పలఁ దేలు నెమ్మనము ద్రిప్పఁగఁ జాలక నేత్రపర్వమై
యొప్పెడు నప్పురాణపురుషోత్తము దివ్యతనూవిలాసముం
దప్పక చూచుచున్ బహువిధంబులఁ బ్రస్తుతిచేసె నమ్రుఁడై.

147


క.

ఆసంస్తవంబు-హృదయో
ల్లాసం బొనరింప మెచ్చి లక్ష్మీశ్వరుఁ డా