పుట:Shriiranga-mahattvamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

119


దక్షిణబాహూపధాన పీతాంబరో
జ్వల కటివిన్యస్త సవ్యహస్తు
వైజయంతీలసద్వక్షు నాకుంచితో
త్థానిత పాదపద్మాసమేతు
యోగనిద్రాముద్రితోద్భాసిలోచన
జలజాతుఁ బశ్చిమాశాశిరస్కు


తే.

నసమ మణిమయ మకుట కర్ణావతంసు
హారకేయూర కంకణోదారపార
సన తులాకోటి ముఖ్యభూషణవిశేష
కలితు శ్రీరంగవిభు జాడఁ గాంచి మ్రొక్కె.

115


క.

అతని నురుభక్తి వినయా
నతు నానందాశ్రుపూర్ణనయనున్ ముకుళీ
కృతకరు విష్వక్సేనుం
డతికృప నాభూతవరుల కనుచరుఁ జేసెన్.

116


మ.

ఇట వైవస్వతకింకరావలియు భూతేశప్రహారస్ఫుట
స్ఫుటితాంగంబుల నెత్తు రొల్కఁ జరణంబుల్ దొట్రిలిం గంప ము
త్కటమై పర్వఁగ నూరుపుల్ పయిపయిం గ్రమ్మన్, భయభ్రాంతి మి
క్కుటమై చూపులఁ దోప నొక్కమొగి నాక్రోశించుచుం దీనులై.

117


చ.

ఇనతనుజాతు ముందటికి నేఁగి సగద్గదవాక్యవృత్తి ని
ట్లనిరి-కృతాంత ము న్నెపుడు సస్ఖలితస్థితి నిజ్జగంబులం
జను భవదాజ్ఞ విష్ణుభటసంఘముచే నిదె నేఁడు సర్వమున్
బెనుపఱె చూడ నేము పరిభూతుల మైతిమి వారిచే మదిన్.

118


వ.

అవ్విధం బవధరింపుము.

119


ఉ.

నేము భవన్నియోగసరణిం జనియించుచు నొక్కశూద్రు ను
ద్దామనికామ పాతక విధానపరాయణుఁ గాలగోచరుం
బామరు నిందుఁ దెచ్చుటకుఁ బట్ట కడంగెడునంతలోన ద
త్సీమకుఁ గావలై మెలగు ధీరులు భూరిభయంకరాకృతుల్.

120