పుట:Shriiranga-mahattvamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ద్వితీయాశ్వాసము


ఆ.

ఏను గమలభవుఁడ నీతండు శశిమౌళి
హరిహయుం డితండు సురలు వీర
లింతవట్టువార మెపుడు నీపదములు
గోరి తలఁచి బ్రదుకువార మీశ!

217


ఉ.

దేవ! సనత్కుమారుఁ డతితీవ్ర తపోరతి నున్నవాఁడు లో
కావలి తత్ప్రతాప మహితార్చికి మండెడు, వానికోర్కినే
మై వివరింపఁ దీర్ప నసమర్థుల మౌటను భూతకోట్లకున్
నీవు శరణ్యుఁ డౌటను మునిస్తుత! నీ కిది విన్నవింపఁగన్.

218


క.

మావచ్చుట యిట మీఁదట
దేవర చిత్తంబుకొలఁది తెల్లం బని భా
పావిభుఁడు నూరకుండిన
శ్రీవల్లభుఁ డంత దరహసితవదనుండై.

219


చ.

వనజభవున్ హరుం ద్రిదశవల్లభుఁ జూచి సనత్కుమారస
న్ముని దపమాచరించుపని మున్న యెఱుంగుదుఁ దన్మనోరథం
బనితరసాధ్య మట్లగుట నంతయు నేనొకజాడ దీర్చిపొ
మ్మనియెదఁగాని మీరు చనుఁడా తమవీడులకున్ ముదంబునన్.

220


తే.

పద్మసంభవ! నాదృష్టిపథమునందుఁ
బడినవాఁ డెప్పుడైన నాపదఁ దొఱంగి
చిరతరైశ్వర్యసుఖములఁ జెంది వెలుఁగు
ననియె మఱి చెప్పనేల నీయట్టివారి.

221


చ.

అనినఁ గృతార్థులై ప్రమదమారఁ దదీయపదారవిందవం
దన మొనరించి తద్వరశతంబులు గాంచి, విశేషకాంతియౌ
వన కరుణావలోక మృదువాగ్విభవంబు లనేకభంగులన్
వినుతులు సేయుచున్ జనిరి విశ్వపితామహముఖ్యదేవతల్.

222


వ.

అని యిట్లు కృష్ణద్వైపాయనుండు నాగదంతున కెఱింగించిన తెఱంగు.

223