పుట:Shriiranga-mahattvamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

79


బరమపవిత్రు, సన్ముని సుపర్వతతి స్తుతిపాత్రునిన్, మనో
హర ఫలశేముషీ కబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్.

142


శా.

లీలం దార్కొని యేసె నుగ్రరణకేళిన్ వాలి వాలిం బ్రభా
హేళిన్ హేమసరోజమాలి, కరివాహిత్యాటవీకీరి, ను
త్తాలవ్యాళ కరాళవాల పరిబద్ధస్థూల పౌలస్త్యకం
ఠాలిం బూజితశూలి నప్రతిమబాహాసత్వశాలిం బదన్.

143


క.

కిష్కింధాపురి నిలిపెను
బుష్కరహితతనయు సునయు భూనుతవినయున్
నిష్కాశిత రిపుజీవుని
నిష్కలిభావుం బ్రతాపనిధి సుగ్రీవున్.

144


మహాస్రగ్ధర.

బలిమిం గట్టించె నత్యుద్భట భిదురధురాపాత భీతావనీభృ
త్కుల సంరక్షావినిద్రుం గుపితజలచరక్రూరసంఘట్టనోద్య
జ్జల నిర్ఘోషాధిరౌద్రుం జనితమణిసుధాచంద్రలక్ష్మీస్ఫురద్రుం
బ్రళయాంత స్సుప్తవిశ్వంభర భరితకృపా ప్రాప్తభద్రు న్సముద్రున్.

145


మ.

హతు గావించె సపుత్రమిత్రముగ దీప్తాస్త్రంబులం గాంచన
క్షితిభృద్ధన్విధరాధరోద్ధరణశక్తిప్రౌఢ దోర్దండసం
గత భాస్వద్ఘనచంద్రహాస నిశితోగ్రక్రూరధారా సమా
హత భీతప్రపలాయితాదితిసుతేంద్రైరావణున్ రావణున్.

146


వ.

ఇట్లనన్యసాధ్యంబు లగు మహానుభావప్రతాపతేజోవిశేషాదిగుణంబుల
నఖిలజగన్నుతుండై దశరథసుతుండు సమస్తసామ్రాజ్యభోగంబుల ననురా
గిల్లుచు శశ్వదైశ్వర్యం బవార్యంబుగా-నశ్వమేధయాగం బుపక్రమించి, భూ
చక్రంబున విక్రమకళాధన్యులగురాజన్యులఁ దన్మహోత్సవంబునకు రప్పిం
చుచు-ధర్మవర్మావనీవరుఁ బిలిపించిన నతండును-నిఖిలదేశాగతానేకభూపాలావ
లోకనజాత కౌతూహలాయిత శాతోదరీనరణ మణినూపుర ఝళంఝళధ్వనిత
గోపురంబగునయోధ్యాపురంబుఁ బ్రవేశించి-యారఘునందన చరణారవింద
సందర్శనంబునఁ గృతార్థీకృతజన్ముండై -తన్మఖంబు పరిపూర్ణంబగునంతకు
నందుండి మరలి నిజపురంబునకుం జని-యంత నిక్కడ-

147