పుట:Shriiranga-mahattvamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ద్వితీయాశ్వాసము


పర్యంకంబున వెలుంగు రంగమందిర సందర్శనంబు గావించి- నిరర్గళ
భోగాపవర్గంబులం జెంది రందు మార్గంబు నాకు దుర్గమంబై యున్న దనిన
నస్మత్పుత్రపౌత్రాదుల నెన్ననేల యిది గావున నాతెఱంగు పొందుపడు
నంతకు నసురాంతకు భజియింతునని చింతించి యనంతతపోనిష్ఠుం డగు
వశిష్ఠున కంతఁదద్వృత్తాంతం బంతయు నెఱింగించిన నమ్మునిసత్తముం
డానృపోత్తమున కిట్లనియె.

6


క.

ఈతలఁపు మేలు జనవర
నీతపమున సంభవించు నిజ మెంతయుఁ బ్ర
ఖ్యాత పురాతన మునితతి
చేతన్ మును వింటి - వినుము చెప్పెద నీకున్.

7


చ.

జగదుపకారబుద్ధి నరిశాసన! నీవు తపం బొనర్పఁ బ
న్నగపతిశాయి దివ్యభవనం బజుఁ డప్పుడు తాను దెచ్చి నీ
కగణితభక్తి నిచ్చు-నది యాదిగ నీపురినుండు ధర్మపా
రగు లగు యుస్మదన్వయ ధరావరు లెల్ల భజింపఁ బెంపునన్.

8


క.

అటు కొంతకాల మరుగఁగఁ
బటువిక్రమశాలి రామభద్రుఁడు గుణలం
పటుఁ డగు విభీషణున కా
దఁట నొసఁగిన నిజపురమున కదిగొని చనుచున్.

9


తే.

నడుమఁ గావేరికడ దృగానందమైన
యిందు పుష్కరిణీతటి నిడి-కదల్ప
నలవికా కేఁగఁ గల్పాంత మందునుండి
బ్రహ్మలోకంబునకుఁ బోవు పార్ధివేంద్ర!

10


క.

ప్రతికల్పము నీగతి నా
గతుఁ డగు దివినుండి భువికి గమలోదరుఁ డా
శతధృతి దినములు దఱిగిన
నతులిత నిజదివ్యపదమునందు వసింతున్.

11