Jump to content

పుట:Shriiranga-mahattvamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనాడు అచ్యుతదేవరాయలవారు అసంపూర్తిగా వదిలిన గోపురమును నేడు తమిళనాడు ప్రభుత్వమువారు పూర్తిచేయ తలపెట్టి 20-5-1979 నాడు ప్రారంభోత్సవము చేసినారు. ఇది పూర్తియైనచో- 248అడుగుల ఎత్తు, 15 అంతస్థులు ఉండగలదు.

ఆశ్చర్యకరమైన విషయ మేమనగా- ఈరాజగోపురము పునాది (ఫౌండేషన్) 18అడుగులకు మించిన లోతులో గలదట. శ్రీ లోకనాథం అనే చీఫ్ఇంజనీయరు- త్రవ్వించిచూడగా - అంతు చిక్కలేదు - గాని అపరిమితముగా నీరు మాత్రము ఊరి వచ్చినది, 'ఆజలాంతం- 'దేవాలయనిర్మాణ మనుపద్ధతికి ఇది యొక తార్కాణము.[1]

స్వామివారి గర్భాలయము సప్తప్రాకారములు దాటిన తర్వాత గలదు. ఇందలి మొదటి మూడుప్రాకారములు లౌకికుల పట్టణములు, నాల్గవదానినుండి- శ్రీరంగనాయకులవారి ఆస్థానము. అయినను, యాతాయాతజనవ్రాతము- ప్రయాణీకుల వాహనములు- ఈరద్దివలన మనము ప్రాకారములలోపల నున్నవిషయమే విస్మరింతుము.

ఇచట, స్వామివారిది శయ్యావిగ్రహము, సుమారు 20 అడుగుల మూలవిరాణ్మూర్తి, దేవాలయమున కుభయపార్శ్వముల కావేరి ప్రవహించును.[2] ఇచట ఈనది రెండుగా చీలి-ఉత్తరశాఖ కొల్లడ (కోల్ రూన్) అనే పేరు గలిగియుండును. దక్షిణవాహిని కావేరి-ఇది మరి ఐదు శాఖలుగా మారి ఆప్రాంతమును సస్యశ్యామలముగా చేసినది. త్యాగరాజస్వామివారి తిరువయ్యూరు (తిరు-అయ్యారు, ఐదునదులు) కావేరీతీరముననే గలదు.

కరికాలచోడుడు ఈకావేరికి ఆనకట్టలు కట్టించుట ప్రసిద్ధమైనవిషయము.

  1. 29-7-79నాటి 'హిందూపత్రిక'లోని చిన్నవ్యాసము ఆధారముగా ఈవిషయములు గ్రహించనైనవి.
  2. ఇచ్చట కావేరి బాహువులు సాచిననాయిక యని-స్వామివారు నాయకుఁ డని- కవులవర్ణన-అట్టిదే-ఈ శ్రీరంగమాహాత్మ్యమునందు గలదు(1-104-141).