Jump to content

పుట:Shriiranga-mahattvamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రికార్డులు- 10 శతాబ్దము A. D. నుండి గలవు. ప్రస్తుతమున్న దేవాలయము 13 శతాబ్దమున అభివృద్ధి చేయబడినది. దీనికి పాండ్యులు ముఖ్యులు. అనంతరము వచ్చిన రాజవంశములవారు ఈ స్వామివారికి భూరిదానము లిచ్చినట్లు మన చరిత్రలు తెల్పును.

ఇట్టి దివ్యక్షేత్రము — ఎన్నియో రాజకీయమైన దండయాత్రలను - అన్యమతస్థుల ప్రధ్వంసకార్యములను అనుభవించినది. ముఖ్యముగా మహమ్మదీయుల దండయాత్రల వలన దేవాలయశోభ చెడిపోయినది. క్రీ. శ. 1371లో - మలిక్ కాఫిర్ దండయాత్ర (బుక్కరాయల మధురా విజయయాత్ర కూడా ఈ సమయముననే) జరిగినప్పుడు ఆ అల్లకల్లోలములకు తట్టుకొనలేక - శ్రీమాన్ వేదాంతదేశికులవారు- స్వామివారి విగ్రహమును తిరుపతికి తీసుక వెళ్ళి రక్షించి- అనంతరము యథాస్థానమును చేర్చినారట. ఈ విషయమును దెలుపుచు దేశికులవారు వేయించిన ఒకశాసనమునం దీ క్రింది శ్లోకము గలదు.

'ఆనీయానీలశృంగద్యుతిరచితజగద్రంజనాదంజనాద్రేః
చెంచ్యా మారాధ్యకంచిత్ సమయమధనిహత్యోధనుష్కాన్ తురుష్కాన్
లక్ష్మీక్ష్మాభ్యా ముభాఖ్యాం సహనిజనరరే స్థాపయన్ రంగనాథం
సమ్యక్చర్యాన్ సపర్యాన్ పునరకృతయశఃప్రాపణో గోపనార్యః॥

(బుక్కరాయల ధర్మోద్ధరణమును శ్లాఘించుచు దేశికులవారు శిలాఫలకమును వేయించుచుండగా- గోపనదండనాథుడు స్వామివారికి చేసిన యనితరసాధ్య మగు బృహత్ కైంకర్యమును - దలచి - ఆశువుగ నీ శ్లోకమును చెప్పి- వ్రాయించినారు)

ఆనాటి దండయాత్రలకు దేశికులవారు ఎంతగా కుమిలిపోయిన దీశ్లోకమే తెల్పుచున్నది.

ఈఅలజడుల కారణముగా అప్పటికి విజయనగరరాజులచే నిర్మాణము చేయింపబడుచుండిన స్వామివారి గోపురనిర్మాణముకూడా ఆగిపోయినది. తర్వాత అనగా క్రీ శ. 1530-1542సం.లో చేరరాజు విజయానికి చిహ్నముగా అచ్యుతదేవరాయలవారు నిర్మింప తలపెట్టిన గోపురముకూడా 46 అడుగుల పరిమాణములోనే ఆగిపోయినది.