'అంధకజనదూషితంబులు ఘనంబులు గావె
యమూల్యరత్నముల్'
ప్రాతఃస్మరణీయు లైన కవిగారు ప్రకటించిన గ్రంథమును మరల ఈనాడు నా సంపాదకత్వమున సాహిత్య ఎకాడమీవారు ముద్రించుచున్నందులకు ధన్యుడను.
కవిగారిపై నాకు గల భక్తిభావము ఈ నాల్గుమాటలు వ్రాయించినది. ఆ యశశ్శరీరునకు సవినయముగా వందనసహస్రము లర్పించుచున్నాను.
పండితప్రభాకరులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు క్రీడాభిరామము పీఠికలో కవిగారిని గూర్చి -
"సాహిత్యప్రపంచమున మాబోంట్లు తిన్నగా
కన్నులు తెఱువక పూర్వమే రామకృష్ణకవి
గారు ప్రాచీనప్రబంధములను ప్రకటించిరి -"
(క్రీడాభిరామ పీఠిక - 1930)
వీరు ప్రకటించిన 'శ్రీరంగమహత్త్వము' శ్రీరంగక్షేత్రవిషయము గలది గదా! అందువలన శ్రీరంగమును గూర్చి స్వల్పపరిచయము చేయుదును-
శ్రీరంగము
దక్షిణదేశమందలి అతిప్రాచీనములైన పుణ్యక్షేత్రములలో పేర్కొనదగినది శ్రీరంగము. అరవవారు దీనిని అరంగమందురు. నేటి తమిళనాడురాష్ట్రములో తిరుచినాపల్లి జిల్లాయందు ఈ క్షేత్రము గలదు. ఇచ్చటిస్వామి శ్రీరంగనాయకులు. 108 దివ్య తిరుపతులలో నొకటగు ఈ క్షేత్రము - శ్రీవైష్ణవులు సేవించు ముఖ్యక్షేత్రములలో నొకటి. ఈ దేవాలయ నిర్మాణము ఎప్పుడు జరిగినది చరిత్రకారులకు అందని విషయము. పురాణములయందు మాత్రము ఇది క్రీ పూ 10 శతాబ్దానికి చెందిన ఆలయ మని గలదు. దేవాలయ శాసనాలు —