పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

శ్రీకృష్ణులవారు పూజార్హు లని చెప్పినయుభయులలో భీష్మునిమీఁద బుష్పవృష్టి యేల కురియలేదు ? మును లతని నేల మెచ్చలేదో చూతము. వీ రుభయులును శ్రీస్వామివారిని దైవముగాని, మనుష్యమాత్రుఁడుగాఁ డని యెరుగుటలో సములే అయితే యాభగవంతునియందు సాధ్యభక్తిగలవాఁడు భీష్ముడు కరణత్రయప్రపత్తియేకాక తాత్కాలికపూర్ణప్రపత్తి గలనాఁడు సహదేవుఁడు. అందువలన నితఁ డధికుఁ డాయెను.

శ్రీకృష్ణులవారు రాయభారమున కరుగునపుడు తననలుగురుసోదరులు చెప్పినపిదప నీసహదేవుఁడు వారితో "ఈధర్మరాజును దక్కినసోదరులును సంధి పొసఁగునని యాసతోఁ బలికిరి. మీరును మారు చెప్పకయుండుట చిత్రము. ఆహా ? వీరిప్రార్థనాప్రకారము మీరు పోయినను సుయోధనుఁ డేమి ? భూమిలో సగపా లిచ్చు టేమి? ఎప్పటికైన జరుగునా ! ఇట్టి దైన్యమునకు వీరులగు మావారు లోబడవలయునా ? పయి రాజు లీదీనతను మెత్తురా ? బంధువులును మిత్రులును నిందింపరా ? ఇది యేమిపని ? ధర్మరాజు వేడుకొను టేమి? శ్రీకృష్ణుల వారడుగబోవుట యేమి? బహుబాగుగ నున్నది. ఎప్పటికైనఁ ధృతరాష్ట్రపుత్రులు రాజ్యభాగము నిత్తురా! వీరికోరిన ప్రకారము వా రొప్పినను నాసంధి యెంతకాలము నిలుచును? యుద్ధమే తప్పక జరగవలసినది. నేను వంకమాట లాడలేను.