పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

చేయుట తప్పు గాదని కర్ణుఁడు పలికెను. ఆయుద్దేశముతోనే దుర్యోధనుఁ డామెను సభకు రప్పించి యుండును. ఆదుష్టుల దుర్మార్గత చెప్ప నేల ! వేశ్యనైనను లేదా ఎట్టిగుడిసేటుదానినైనను సభయందుగాని నలుగు రుండుచోటఁగాని వస్త్రవిహీను రాలినిగ చేయవచ్చునా ? మరియుఁ బాండవులకు బావమరది వరుసగల సైంధవుఁడు నరణ్యవాసమం దున్నద్రౌపది నైదుగురు భర్తలుగలది యనియేకదా యీడ్చుకొనిపోయెను. ఆపిదప భీమార్జును లతనినిఁ బట్టి కట్టి తెచ్చుట యాపయిని తల గొరిగి యూర్ధ్వపుండ్రము లుంచి పాండవదాసునిగాఁ బ్రదుకుమని విడుచుట జరిగియున్నది.

ద్రౌపదీవివాహానంతరమున ధృతరాష్ట్రుడు పాండవులను బిలిపించి వారియర్ధరాజ్యమును ధర్మరాజున కిచ్చెను. ఇటుల కొంతకాలమైనవెనుక ధర్మరాజు రాజసూయమను నొక గొప్పక్రతువును జేసెను. మొదటినుండియు బాండవులయెడ మత్సరబుద్ధితో నున్న దుర్యోధనుఁ డాక్రతువుయొక్క వైభవమును, రాజులు దెచ్చినకానుకలను, ధర్మరాజునం దితర రాజులకు గలగౌరవమునుఁ, జూచి మరియు మచ్చరించెను. ఆపయిని జరిగినకపటద్యూతాదులవిషయ మిదివరకే చెప్పఁబడియున్నది.

పాండవు లరణ్యవాసమున నుండుతరి దుర్యోధనుఁడు ఘోషయాత్రకుగా వెడలి గంధర్వులచే బట్టువడి విడిపింపఁ