పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

తగినగురునివద్ద నేర్చికొనకపోవుటయు, తనస్వరూపస్వభావములను మరుగుపరచి తగినగురునివద్ద నేర్చికొనుటయు నొక్కటియే. అట్టివిద్యలు వృద్ధికిరావు.

ఈకర్ణుఁడు క్రమముగ దుర్యోధనునియొద్ద బ్రవేశించి యా రాజకుమారునికి బాండవులయందు గలద్వేషమును సభివృద్ధి చేయుచు వారియెడల జేయఁబడు దుష్కార్యములకు బ్రోత్సాహపరచుచు నతసన్మాని యాయెను. ఇటులనె చాలమంది ప్రభువులయొద్ద సన్మాను లగుచుందురు. అస్త్రవిద్యయందు గల నేర్పునుబట్టి పాండవుల నెదుర్కొనుటకు నితఁ డొక ప్రధాన వీరుఁడుగ నెన్నఁబడి దుర్యోధనునివలన నొక స్వల్పరాజ్యమున కభిషేకింపఁబడెను. అటుపయి యీతనిచర్య యీగ్రంథము యొక్క యుపోద్ఘాతములో వివరించి చెప్పఁబడియున్నది. ఇతఁడు భారతయుద్ధములో రెండుదినములు సేనాధిపతిగా నుండి యర్జునునిచే సంహరింపఁబడెను.

17. శకుని.

ఇతఁడు గాంధారదేశపురాజు, గాంధారిదేవికి సోదరుఁడు అందుచే దుర్యోధనదుశ్శాసనులకు మేనమామయై యున్నాఁడు. గొప్ప జూదరి. మిగుల మోసగాడు. ఇతనిచే నాడఁబడిన కపట ద్యూతమునందే రెండుసారులు ధర్మరా జోడెను. భారతములోఁ జెప్పఁబడిన దుష్టచతుష్టయములో నితఁ డొకఁడు.