పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

ఉత్తర రామాయణము లేదా ఉత్తరకాండ యనునది యీ పూర్వరామాయణకాండలు పుట్టిన యనేకసంవత్సరముల పిదప బుట్టినందున బూర్వభాగమున నున్న దానికంటె ననేకము లగుసందర్భములతో నిండియున్నది. కావున నే భాగమును దానిలోనుండి ప్రమాణముగఁ దీసికొనక యొకటి రెండు విషయములనుఁజూపి శ్రీరామకథను ముగింపజేసెదను.

శ్రీస్వామివారి ప్రభుత్వకాలము చాలవరకు భుక్తియైనపిదప బౌరులలో గొంద రనుకొనుచున్న మాటను దెలిసికొని గర్భవతియగు తనభార్యయైన సీతాదేవిని వాల్మీకి యాశ్రమమున విడిచిపెట్టిరమ్మని శ్రీస్వామివారు లక్ష్మణున కాజ్ఞయిచ్చుటచే నతఁ డట్లు విడిచివచ్చినట్లును, పిమ్మట గుశలవులకు సూక్ష్మరూపముగ వాల్మీకిప్రోక్త మగురామాయణమును శ్రీస్వామివారి సన్నిధిని గానము చేయఁదగినంత వయసువచ్చువరకు సీతావిషయమును శ్రీస్వామివారు విచారింపక యున్నట్టును, అపుడు తిరుగ నామెను దెప్పించి యామె పాతివ్రత్యమును గూర్చి శపథము చేయుమన్నట్టును నందుఁ జెప్పఁబడి యున్న ది. లంకలో సమస్తజనులు చూచుచుండఁగ నగ్నిప్రవేశమయి యందువలన దహింపబడక పవిత్రురాలుగ నేర్పడినభార్యను బరిగ్రహించిన శ్రీరాములవారు పయివారిమాటను బురస్కరించుకొని య ట్లామె నరణ్యమునకుఁ బంపి యుందురా?