పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

127

10. రావణుఁడు.

ఇతఁడు లంకారాజ్యమునకు బ్రభువు. బహుపరాక్రమవంతుఁడు. మనదేశమునకు వచ్చి యనేకులగు రాజులను జయించియుండును. దిక్పాలకులను సహా జయించె నని యిఅగ్రంథకర్తచెప్పెను.

ఇట్టిపరాక్రమము గలవాఁడైనను బరస్త్రీలోలుఁ డయి చాలమంది సుందరులగుస్త్రీలను దెచ్చిపెట్టుకొనెను ఇట్లు కొంతకాలము జరిగినపిదప దనచెలియలగు శూర్పణఖవలన నరణ్యవాసమునం దున్న సీతాదేవియొక్క సౌందర్యమునుఁ దెలిసికొని యచటి కేగి ప్రచ్ఛన్న వేషమును దాల్చి శ్రీరామ లక్ష్మణులు లేనిసమయమున సీతాదేవియొద్దకు భిక్షుకునిరూపమున నేగి యామె నెత్తుకొని లంకకుఁ బోయెను. అచ్చట నాదేవి యతనికి వశ్యురాలు కానందున నామె నశోకవనమున నుంచి స్వాధీన మగుటకొరకు రాక్షసస్త్రీలచే శ్రమపరచుచు వచ్చెను. ఇట్లు సుమారు పదిమాసముల కాలము జరిగినవిదప శ్రీరాములవారు వానరసేనతో వచ్చి లంకాపట్టణమును ముట్టడించిరి. అప్పుడు రావణుఁడు శ్రీరాములవారిచే రాయభారమునకయి పంపఁబడిన యంగదుని నిరాకరించి సేనలను విభజించి నాలుగుదినములవరకు ననేకరాక్షసవీరులను యుద్ధమునకుఁ బంపెను. వారందరు హతు లైన పిదప నైదవనాఁడు