పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

115

స్వలాభకరమైన కార్యమైనను యుక్తాయుక్తవిమర్శనము లేక తొందరపడి ప్రయత్నించినపుడు కైకేయికివలె గావలసినంతలాభము గలుగదు.

వరములనిర్దేశమును దెలిసికొనక యొక రడిగినవరము నిచ్చెద నని ప్రతిజ్ఞ చేయుటయం దవివేకమువలన నీవరముల నిచ్చిన యీదశరథుఁడు పట్టాభిషిక్తుఁ డగుటకు సిద్ధముగనున్న జ్యేష్ఠకుమారుని నడవికిఁ బంపుకొనెను. నలుగురుపుత్రులుండియు నొక్కఁడైన దగ్గర లేనిసమయమున మృతినొందెను. ఇట్లు మృతినొందుట కొకశాపకథ కల్పింపఁబడినది. అది కల్పిత కథయైనను నందువలన మనము గ్రహీంపవలసిననీతి యేమి యనిన :- రాజులకు వేట స్వధర్మమైనను మిగులఁ జాగ్రత్తతో వేఁటాడక పోయినయెడలఁ బ్రమాదము సంభవించునని. ఇట్లు శ్రీరాము నరణ్య వాసమునకుఁ బంపి దశరథుఁడు వా రడవికేగిన యారవనాఁటిరాత్రి పరలోకప్రాప్తుఁ డయ్యెను.

2. వశిష్ఠుఁడు.

ఈయన మనయార్యమతస్థులచే నిత్యు లని నమ్మఁబడు సప్తమహర్షులలో నొకఁడు. ఇక్ష్వాకువంశజు లందరకును గ్రమముగఁ బురోహితుఁడుగ నుండెను. ఇట్టివానిచే నుంపఁబడిన పట్టాభిషేక ముహూర్తము సహా కార్యకారి కాకపోవుటయే గాక శ్రీరాములవారి కరణ్యవాసకష్టమును గలుగఁజేసెను.