పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

షేకము చేయుటయు నై యున్నవి. ఇవి యాయమకు మనస్సునందుఁ బుట్టినకోర్కెలే యయియున్న యెడల వివాహకాలమునందు రాజ్యశుల్క గాఁ దనతండ్రికి బ్రతిజ్ఞచేసి యుండుటనుబట్టి యామె మూడువరము లడిగియుండవలెను. అట్లుగాక దానినిఁ గలిపి మరియొకవరము నడిగెను. ఆయడుగుటలోనును బదునాలుగు సంవత్సరముల కాలపరిమితికి మాత్రము తనకుమారునకు రాజ్యము గావలె ననునర్థ మిచ్చునట్లుగ నడిగియుండును. అట్లు గానియెడల దశరథుఁ డామెతో శ్రీరాములవారి 'నడవికిఁ బంపువరమును మాత్రము విడుచుకొనుము. నీకుమారునకే రాజ్య మిచ్చెద' నని యేల యడిగికొనును. వరమునందు గాలపరిమితియే లేక పోయినయెడల నొకసారి కాలనియమము లేక యిచ్చినదానినే తిరుగ నిచ్చుటలో నామెకు లాభమేమి ? మరియు శ్రీరాముల వారు భరతునితో 'మనతండ్రి నన్ను బదునాలుగువత్సరము లడవిఁ బొ మ్మనియు నిన్ను రాజ్య మేలు మనియు నియమించి యున్నాడు' అని యున్నారు. కాలనియమము లేక భరతునకుఁ దమతండ్రి వలన రాజ్య మీయఁబడియుండినయెడలఁ దమయరణ్యవాసానంతరము రాజ్యమును స్వీకరింతురా? చదువరులే యోచించునది.