పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

దృఢముగను, నిస్సంశయముగను జెప్పఁగలను. మరికొన్ని దేవాలయముల యం దిరుపార్శ్వముల యందును రుక్మిణీసత్యభామలు గల శ్రీకృష్ణులవా రారాధింపఁబడుచున్నారు. గాని నాకు దెలియవచ్చినస్థలములలో నెచ్చటను రుక్మిణీదేవిమాత్రము గల శ్రీకృష్ణులవా రారాధింపఁబడలేదు. రుక్మిణి యనఁగా లక్ష్మీదేవియొక్కయవతారమే యని మనకందరికిం దెలిసినదియేకదా? అట్టిలక్ష్మితో మాత్రము వారి నారాధించుటకుఁగా నీరెండువిగ్రహములు గల యాలయములం గట్టించి ప్రజలు పూజింపగోరి యుండవచ్చును. ఈవిధముగ స్త్రీపురుషద్వంద్వనామములనుచ్చరించునపుడు స్త్రీనామమును ముందుగాను బురుషనామమును వెనుకగాను నుంచి చెప్పుట కలదు. అనఁగా సీతారామ, లక్ష్మీనారాయణ, పార్వతీపరమేశ్వర, అనువిధములు గలవు. అట్టిద్వంద్వనామములు చెప్పునపు డతిసులభముగఁ నుచ్చరింపఁబడుచున్నవి. అయితే రుక్మిణి యను నామము శ్రీకృష్ణనామముతోఁ బయినామములవలె సులభముగఁ బలుకఁబడదు. మరియు బూర్వనిపాతశాస్త్ర విరోధ మనియుం జెప్పుదురు.

లక్ష్మీ సహస్రనామములలో రాథ యనుపేరు లక్ష్మికిం గలదు. ఆసహస్రనామములలో శ్రీకృష్ణనామముతో రాథయను పేరుతప్ప దదితరనామము లంతసులభముగ గలిపి పలుకఁబడవు.