పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

సర్వశరీరములయందును వ్యాపించియున్న యీయాత్మ యెప్పుడుసు జంపఁబడదగనివాఁడే. అందువలన నీవు (భీష్మాది) సమస్తజనులనుఁగూర్చియు దుఃఖింపఁ దగవు.

ఇంతియ కాదు. క్షత్రియుఁడవగు నీయొక్క వర్ణధర్మము నాలోచించినను నీవు చలింపఁ దగవు. క్షత్రియునకు ధర్మయుద్ధమునకంటె నితరమైనమేలు లేదుకదా?

ఓయర్జునా ! కోరకయే సంభవించినట్టియు, దెరువఁబడిన స్వర్గద్వారమైనట్టియు యుద్ధము నేరాజులు పొందుచున్నారో వారిహపరసుఖములు గలవా రగుచున్నారు.

నీవు ధర్మయుక్తమైన యీయుద్ధమును జేయవేని నందువలన వర్ణధర్మమును, గొప్పధనుర్ధరుఁడ వనుగీర్తిని, జెడగొట్టుకొని వర్ణధర్మమును విడుచుటవలన గలిగిన పాపమును బొందుదువు.

ఇంతియకాక నీయపకీర్తిని జనులు శాశ్వతముగఁ జెప్పుకొందురు. గౌరవము గలవాని కపకీర్తి వచ్చిన నది మరణమున కంటెను గొప్పది యగుచున్నది.

ఓపార్థుఁడా ! నీవిదివరలో నెవ్వరిచే గొప్ప వీరుఁడవని కొనియాడబడుచుంటివో యట్టి మహారథులయిన రాజులు ని న్నిపుడు భయమువలన యుధ్ధమునుండి మరలినవానిగా దలంతంరు. అందువల్ల నిన్ను గౌరవించిన వారే చులకగ జూతురు.