పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

73

వాఁడును, మొదలు లేనివాఁడును, దనకుపాధియైన శరీరము మరలమరల మారుచుండినను దా నెన్నటికిని మారనివాఁడు.

ఓయర్జునా ! ఎవ్వ డీయాత్మను బుట్టువు లేనివానిగాను, శాశ్వతునిగాను, నాశరహితునిగాను, మారుపు లేనివానిగాను దెలిసికొనుచున్నాడో యాపురుషుడు తా నొకని జంపింతు ననియుఁ జంపుదు ననియు నెట్లుతలంచును?

నరుఁడు శిధిలవస్త్రములను విడిచి క్రొత్తవస్త్రముల నెట్లు ధరించుచున్నాఁడో యటులనే దేహాభిమానము గలయాత్మ శిధిలము లగుచున్నశరీరములను విడిచి నూతనశరీరములను ధరించుచున్నాఁడు.

ఈయాత్మ నాయుధములు భేదింపఁజాలవు. అగ్ని కాల్పఁ జాలదు. ఉదకములు తడుపలేవు. గాలి యెండింపను జూలదు.

ఈయాత్మ భేదింపఁదగనివాఁడు. దహింపఁదగనివాఁడు. తడుపఁదగనివాఁడు. ఎండింపఁదగనివాఁడు. ఎల్లప్పుడు నొక్కరీతిగా నుండువాఁడు. సర్వప్రాణులయందు వ్యాపించియుండువాఁడు. స్థిరుఁడు, చలనములేనివాఁడు. మొదలు లేనివాఁడు.

ఈయాత్మ కన్నులు మొదలయిన బహిరింద్రియములచే గ్రహింపఁబడువాఁడు గాడు. అంతరింద్రియమైన మనస్సుచే సాధారణముగఁ దెలియబడఁదగినవాఁడు గాఁడు. పెరుగుట తరుగుట మొదలగువికారములను పొందింపఁబడదగినవాఁడు