పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix

నుదాహరింపఁబడినకార్యముల నాయన చేసియుండడు. కావున కర్ణుని దాతృత్వముగూడ నిర్వ్యాజౌదార్య సూచకముకాదు.

శ్రీమన్నారాయణావతారంబని హిందూమతస్థులందరునమ్మిన శ్రీ కృష్ణుడు పరాత్పరుని యవతారంబు లన్నిటిలోఁ బరమాద్భుతమయిన యవతారమని చెప్పుటలో సందేహ మేమియు లేదు. ఇట్టి యవతారపురుషుఁడు సామాన్యముగ మనుష్య నింద్యములయిన కొన్ని కృత్యములను జేసినటుల భారతములోను భాగవతాది పురాణములలోను నున్నది. లోకరక్షణార్థము మనుష్య రూపమునొందిన హరి యిట్టిపనులను జేయునా యని విచారించుటలోనీ పనులను గూర్చినగాధలు శ్రీకృష్ణ నిరసనంబునకై. కల్పితంబులైన గావలెను. కానిచో మనము వాని నన్యార్థ వ్యంజకంబులుగానైనఁ దీసికొనవలయును. ఈ గాధలకు వ్యంగార్థమిచ్చుట సందర్భము గాదనియు నివి కేవల కృష్ణనిరసన బుద్ధితో గ్రంథకర్తచే గల్పింపఁబడినవియనియు మహారాజావారి యభిప్రాయము. సామాన్యముగ నీ గాధలలో గొన్నిటికి వేదాంతులగు వ్యాఖ్యాతలిచ్చిన వ్యంగ్యార్థము నంగీకరించుటకు జాల బాధలున్నవి. కనుక వానిని వ్యంగ్యార్థమున గ్రహింప వీలులేదు. శ్రీ కృష్ణులు నారాయణావతారంబని నమ్మినవా రందరును గర్హ్యక్రియారోపకములైన యీ గాధలను యథావృత్తబోధకములుగా నంగీకరింపఁ జాలరు.