పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

88

253. కనకమునకై పరితపించులోభివానివలె నీహృదయము భగవంతునికొఱకు తహతహ పడవలయును.

254. ఎవనిపరితాపము తీవ్రముగనుండునో, ఎవనిచిత్తము ఏకాగ్రతపొందునో, ఆతడు మిగులత్వరితముగా భగవంతుని చూడగల్గును.

255. ఓహృదయమా! నీజగజ్జననినిగూర్చి నిజముగా పిలువుము. ఆమెఎంతవేగిరముగా నీకడకు పర్విడివచ్చునో, నీకు తెలియగలదు. పూర్ణహృదయముతో భగవంతుని ఎవడేని పిలుచునెడల ఆయన ఉపేక్షించి యూరకుండజాలడు.

256. "ప్రియమాతా! నాకు ఆకలి అగునప్పుడు నన్నునిద్ర లేపుము." అనిబిడ్డఅడుగగా, "బిడ్డా! నీయాకలియేనిన్ను నిద్రలేపును సుమీ!" అనితల్లిచెప్పినది.

257. ఎన్నడును కొఱవడిపోని భక్తిని, ఎన్నడును చలింపని శ్రద్ధను దయచేయుమని జగజ్జననిని వేడుకొనుము.

258. ఒకతల్లికి చాలమంది పిల్లలుండిరి. ఒకబిడ్డకు మిఠాయిని, ఒకబిడ్డకుబొమ్మను, వేఱొకనికి ఒక పవడమును యిచ్చును. వారందఱును తల్లినిమఱచి తమ ఆటవస్తువులమీదనే దృష్టిగలవారై యుందురు. తల్లి ఆసమయమున తనగృహకృత్యములను చూచుకొనుచుండును. ఇంతలో ఒకపిల్లవాడు తన బొమ్మను అవలపాఱవైచి "అమ్మా! అమ్మా! అని ఏడ్వసాగును. తత్క్షణమే తల్లి పర్విడివచ్చి వానిని లాలన సేయును. అటులనే, ఓనరుడా! ఈప్రాపంచిక ఆడంబరములలోపడి నీవు జగజ్జననిని మఱచిపోయినాడవు. వానిని ఆవల