పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

86

సాధకుడు తరించుటకు, తనప్రయత్నముమీదనే ఆధారపడి యుండవలయును. కాని భక్తమార్గావలంబుడో భగవంతుడే సర్వమును నిర్వహించునని యెఱుంగును; కావున పూర్ణవిశ్వాసముతో స్వామికృపపై ఆధారపడియుండును; మొదటివాడు క్రోతిపిల్లవంటివాడు; రెండవయతడు పిల్లికూనబోలువాడు.

247. ప్రొద్దుపొడుపువేళ చిలికినవెన్న శ్రేష్ఠము. సూర్యుడు ఉదయించినపిమ్మట చిలికినది అంతమంచిదికాదు. శ్రీరమకృష్ణపరమహంసులవారు తనభక్తులలోనిచిన్నవారితో యిట్లనుచుండెడి వారు; "మీరు ప్రాతఃకాలమున చిలికిన వెన్నవంటివారు." సాంసారులగు శిష్యవరులో, ప్రొద్దెక్కినపిమ్మట చిలికినవెన్నను బోలుదురు."

248. 'హోమ' అను పక్షులను గురించిన కధకలదు. అవి ఆకాశమున అత్యున్నతప్రదేశమున నివాసముచేయునట. ఆప్రదేశములందు వానికి అత్యంతప్రీతిగావున, అవెన్నడును క్రిందికిదిగి భూమిపైకిరావు. తమగ్రుడ్లనుసహా అవి ఆకశముననేపెట్టును. భూమి ఆకర్షణచేత అవిక్రిందపడునప్పుడు, గాలియొక్క రాపిడికి పొదుగబడి మార్గమధ్యముననే అవిపిల్లలగును. ఆపక్షికూనలు త్వరలో తాముపడిపోవుచుండినటుల గ్రహించి, వెంటనే నైజస్వభావముచే ప్రేరేపింపబడి, పైకి తమనివాసములకై ఎగిరిపోవునట. శుకదేవుడు, నారదుడు, ఏసుక్రీస్తు, శంకరాచార్యులు యింకనిటువంటి పురుషనరులు యీపక్షులవంటివారు. పసితనమునందు సయితము అట్టివారు లోకవిషయములయెడ రాగములేనివారై, బ్రహ్మజ్ఞాన దివ్య తేజములచే ఆకర్షింపబడి యున్నతపధముల నంటిపోవుదురు.