పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

84

శ్రీరామకృష్ణులవా రిట్లనిరి:- "గ్రద్దలు గరుడపక్షులు ఆకాశమున ఎంతయెత్తునకో యెగురునుగదా. కాని వానికండ్లు ముఱికిగుంటలలో క్రుళ్లుచుపడియుండు మృతకళేబరములను వెదకుటయందే పూనికవహించియుండును. అదే తీరున ఎంతగాశాస్త్రపఠనముచేసినవారైనను, పండితమ్మన్యుల మనస్సులు కామినీకాంచనములను లౌకికవిషయములందు తగులువడియుండుటచేత వారికి బ్రహ్మజ్ఞానము లభించదు."

244. వట్టికడవలోనీరునింపునప్పుడు బుడుబుడమనుధ్వని చేయును. కాని అది నిండినప్పుడు చప్పుడేవినరాదు. అటులనే బ్రహ్మసాక్షాత్కారమును పొందనిమనుజుడు బ్రహ్మమును గురించిన వాగ్వాదములతో అట్టహాసములు చేయుచుండును. కాని బ్రహ్మావలోకనముచేసినవాడో, నిశ్శబ్దముగ బ్రహ్మానందము ననుభవించును.