పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

82

వెదకినాడు. తుదకు అదికాన్పింప వానికి ఆనందముకలిగినది. ఆతడు దానిని ఆతురముతో చదువ అందిట్లున్నది:-

"అయిదుశేర్ల మిఠాయి, వందనారింజపండ్లు, ఎనిమిది ఉత్తరీయములు పంపుడు." ఉత్తరములోని విషయములు తెలియగానే, అతడుదానిని ఆవలపడవేసినాడు. కావలసిన వస్తువులనుకొన నారంభించినాడు.

ఎంతవరకు అటువంటి ఉత్తరముయొక్క అవసరముండును? దానిలోనివిషయములను తెలిసికొనువఱకే గదా! విషయములు తెలిసినతోడనే, దానిలోకోరబడిన వస్తువులను సంపాదించుటే అప్పుడుచేయవలసినపని.

ఇటులనే శాస్త్రములు మనము భగవంతునిచేరుమార్గమును తెలుపును. అనగా బ్రహ్మసాక్షాత్కారమును సాధించు ఉపాయమును బోధించును. మార్గముతెలిసినపిమ్మట చేయవలసినపని, గమ్యమును చేరుటకుసాధనమే. ఆదర్శమును ప్రాపించుటే.

240. ఊరక పుస్తకములను చదువుటవలని ఫలమేమున్నది? పండితులకు చాలశాస్త్రవాక్యములు శ్లోకములును తెలియవచ్చును. అయినను వానిని పదేపదే పారాయణచేయుటవలన లాభమేమి? ఆశాస్త్రములలో చెప్పబడినదానిని ఆత్మానుభవమునకు తెచ్చుకొనవలయును. ప్రపంచవ్యవహార లంపటమున చిక్కియున్నంతకాలమును, కామినీకాంచనములను మోహలోభములతో చూచుచుండునంతకాలమును, ఈపారాయణములు మోక్షము నీయజాలవు.