పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

80

236. బ్రహ్మమును ప్రత్యక్షసత్యముగా నాకండ్లార నేను చూచుచున్నాను. నేనింకవాదించుట ఎందులకు ? ఆ అవ్యయ బ్రహ్మమే మనచుట్టును గోచరించు వస్తుజాలముగమారుట నేను స్వయముగ చూచుచున్నాను. ఆయనయే ప్రత్యగాత్మగను, వికారప్రపంచముగనుకూడ గోచరించుచున్నాడు. ఈసత్యమును చూచుటకు తనలో ఆత్మప్రబోధము కలుగవలసి యున్నది. ఆబ్రహ్మమును ఏకైకసత్పదార్థముగ చూడగల్గు వఱకును, మనము తర్కించుచుండవలయును. ఇదికాదు; ఇదికాదు; "నేతి, నేతి" అనుచు వివేకించుచుండవలయును. "బ్రహ్మమే యీసర్వమును అయ్యెనని నిస్సందేహముగా నేను గ్రహించితిని" అని పలుకుటమాత్రము చాలదు; నిజమే. కేవలము వచించుటచాలదు. దైవానుగ్రహమువలన ఆత్మప్రబోధము కావలయును. ఆత్మప్రబోధము వెనువెంట సమాధిదశ ప్రాప్తించగలదు. ఈదశలో మనకు శరీరమనునది యున్నదనుటే మఱతుము. కామినీకాంచనములతో గూడిన ప్రాపంచికవిషయములందు అనురాగమేరూపుమాయును. లోకవ్యవహారములనుగూర్చి వినవలసివచ్చినచో మిగుల వెగటుతోచును. భగవంతునిగూర్చిన విషయములను మాత్రమేవినుటకు ఆసక్తి యుండును. అంతరాత్మ ప్రబోధము కలిగినపిమ్మట విశ్వాత్మను దర్శించుటే పైమెట్టు. ఆత్మయే ఆత్మదర్శనముచేయ జాలును సుమీ?

237. సమారాధనకై అతిధులు, అభ్యాగతులు అనేకులు చేరినప్పుడు వారుచేయుకోలాహలము పెద్దగవినవచ్చును.