పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

62

193. అటువంటి సద్గురువు పండితుడుగా కాన్పించకున్నను శాస్త్రగ్రంథములను పఠించినవాడు కాకున్నను, అలజడి చెందకుము. ఆతనికి పుస్తకజ్ఞానమేలేకున్నను భీతినందకుము. ఎన్నడును భయసంశయముల పొందకుము. జీవనప్రజ్ఞానమున వానికికొదువలేదు. పుస్తకమువలన లభించుజ్ఞానమును మించు సాక్షాత్కారమువలన లభించిన దివ్యజ్ఞానసంపద వానికడ అనంతముగా ఉండును సుమీ!

194. చదరంగపు ఆటను ఆడువారికికంటె చూచువారికి సరియైనఎత్తులు గోచరించుచుండును. సంసారులు తామెంతయు తెలివితేటలు కలవారమని తలంచుచుందురు. కాని ధనము, గౌరవము, యింద్రియసుఖములు మొదలగు లౌకికవిషయములందు చిక్కుకొనిపోదురు. ఆటలోప్రవేశించియున్న వారి వలెను సరియైన ఎత్తునుగ్రహించనేలేరు. సంసారముల త్యజించినస్వాములు చిక్కులులేనివారు. చదరంగపుఆటను పైగానుండి చూచువారిని పోలియుందురు. సంసారులకంటె విషయములను వీరు చక్కగా విచక్షణచేయగలరు. కావున నిజమౌ పుణ్యజీవనమును నడపజూచువారు, భగవధ్యానశీలురగునట్టియు బ్రహ్మవేదులగునట్టియు మహానీయులమాటలనే నమ్ముకొనవలయును. నీకు వ్యాజ్యసంబంధమైనసలహా కావలసినప్పుడు ఆవృత్తి చేయు న్యాయవాదికడకేగదా పోవలయును! దాఱినిపోవు ఎవనిసలహానైనను సరియేయని నీవు గ్రహించతగదు గదా!