పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

6వ అధ్యాయము.

తనకు హితవగురూపమును పూజించుచుండును. కొందఱికి దేవుడు స్వామి, కొందఱికి తండ్రి, కొందఱికి ప్రియమాత, కొందఱికి సఖుడు, కొందఱికి ప్రేమంపుభర్త, మఱికొందఱికి అత్యంతవిధేయుడగు సుతుడుఅయి ప్రత్యక్షమగుచుండును.

169. దేవఋషులు భగవంతునకు సన్నిహితబంధుకోటిలోనివారనవచ్చును. వారు మిత్రులవంటివారు. భగవంతునికి చుట్టాలును, సహవాసగాండ్రునైయుందురు. తక్కిన సామాన్యప్రజలు దూరపుబంధువులవంటివారు. వీరు భగవంతుని పరిపాలనమునమాత్ర ముందురు.

170. నరునికి వానిసంకల్పముల ననుసరించియు, వాని యుద్దేశ్యముల ననుసరించియు ఫలము లభించుచుండును. భగవంతుడు కల్పవృక్షమువంటివాడు. భక్తులుకోరుకొనుదానినెల్ల ప్రసాదించుచుండును. ఒక పేదవానికొడుకు చాలప్రయత్నించి ఉన్నతన్యాయస్థానమున ధర్మాధికారిపదవిని పొంది "అమ్మయ్యా! నిచ్చెన మెట్లలో కొనదాని కెగబ్రాకితిని, మహానందము! ఇప్పుడుబాగున్నది" అని తలపోయును. అటువంటివానికి భగవంతుడు "ఎల్లప్పుడు ఆస్థితియందేయుండు"మని చెప్పును.

అయినను ఈ ఉన్నతన్యాయస్థానాధికారి ఉపకారవేతనముపొంది పని విడచినప్పుడు, గతజీవితమును విమర్శించుకొని, తనజీవనము వ్యర్ధముగ గడచిపోయునటుల గ్రహించి యిట్లనును:- "అయ్యో! ఏమిచేసియుంటిని?" వానితో భగవంతుడిట్లనును:- "అయ్యో! నీవేమిచేసితివి?"