పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

36

తొలగింపబడినప్పుడు, నరులకుఅతడుభీకరుడై కరుణాశూన్యుడై బాధించు అధికారిగాకాన్పించడు; అత్యంతప్రియుడగు అంతరాత్మయైపఱగును సుమీ!!

116. ఒకసారి వినిర్మలనీలాకాశమున హఠాత్తుగా మబ్బులావరింప, ఉత్తరక్షణముననే పెనుగాలివచ్చి వానిని చెదఱగొట్టుటగాంచి ఒకపరమహంస ఆనందపరవశుడై నాట్యముచేయుచు, ఇటులపలుక సాగెను. "మాయయుఇట్టిదే! మాయ మొదటలేనిదే! అది వినిర్మలబ్రహ్మవాతావరణమున ఆకస్మికముగ గోచరించి, యీజగత్తునంతను సృష్టిచేయుచున్నది! అంతలో ఆబ్రహ్మముయొక్క నిశ్వాసముచేతనేచెదఱగొట్టివేయ బడుచున్నది!!"

117. భగవంతుడు సర్వవ్యాపి అగునెడల మనకేలకాన్పించడు? పాచినాచుదట్టముగా కప్పియున్నకోనేటిగట్టున నిలిచి చూచితివేని దానిలో నీవు నీరులేదందువు. నీవానీరునుచూడ గోరుదువేని నీటిపైనుండి నాచును తొలగించవలయును. అటులనే మాయపొఱలుగప్పినకండ్లతో నీవు భగవంతుని చూడలేక విలపించుచున్నావు. నీవాభగవంతుని దర్శింపకోరు నెడల నీకండ్లపైనుండి ఆమాయయొక్కపొఱలను తొలగించుకొనుము.

118. మేఘము సూర్యుని కప్పివేయునటుల మాయ బ్రహ్మమును కప్పివేయును. ఆమబ్బువిచ్చి పోయినప్పుడు సూర్యుడు కాననగును; మాయ విడిపోయినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమగును.