పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

394

కొనినది. అవి అఱచినటులనే పులిపిల్లయు అఱచెడిది. కొంతకాలమునకు అదియుపెరిగి పెద్దపులియైనది. ఒకనాడు పెద్దపులి యింకొకటి యీగొఱ్ఱెలమందపైబడినది. ఈమందలో గొఱ్ఱెవలెవర్తించు ఈపులినిచూచి అత్యాశ్చర్యము పొందినది. దీనిని తఱిమి మెడపట్టి యీడ్చినది. ఇది గొఱ్ఱెవలె దీనముగా అఱవసాగినది. అంతట క్రొత్తపులి దీనిని చెఱువుకడకు లాగికొనిపోయి నీటిలో తమ ఇరువురి బింబములను చూపినది. "చూడుము; చూడుము; నీ రూపు, నారూపును, పోలియున్నది. నీవును నావలె పెద్దపులివే! ఇదిగో ఈమాంసమును తినుము" అనిచెప్పి బలవంతముగా మాంసమును తినిపించ చూచినది. మొదటమొదట గొఱ్ఱెలలోపెరిగిన పులి మాంసమును తిననొల్లలేదు. మఱియు తాను పులిగాక గొఱ్ఱెననియే చెప్పసాగినది. రెండవదాని బలవంతముచేత కొంచెము నెత్తురు రుచిచూడగా దానిలో అణగిపడియున్న వ్యాఘ్రసంస్కారములు మొలకలెత్తినవి. మాంసమునందు ప్రీతిని గల్పించినవి. అప్పుడా క్రొత్తపులి "ఇప్పుడుగదా నీవునావలెనే వ్యాఘ్రవంశపుదానవని గ్రహించితివి! కావున ఇక అరణ్యములకు పోదమురమ్ము!" అని తీసికొనిపోయినది.

ఈరీతిగా ఒకనికి గురుకటాక్షములభించెనా భయము తొలగును; గురువు కండ్లుతెఱచి సత్యస్వరూపమును తెలుపును.